Chandrababu has not finalized the MP candidates in Anantapur district yet : సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. అభ్యర్థులను ప్రధాన పార్టీలన్నీ ప్రకటిస్తున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇప్పటికే సగానికిపైగా స్థానాలపై స్పష్టతవచ్చింది. అధికార వైసిపి ఏడు అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక టిడిపి తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన జరగలేదు. అనంతపురం, హిందూపురం పార్లమెంట్ స్థానాల్లో ఎవరిని బరిలో దింపనుందన్నది చర్చనీయాంశంగా మారింది.
పొత్తు కుదిరితే హిందూపురం పార్లమెంట్ బీజేపీకి !
పొత్తుల్లో భాగంగా హిందూపురం పార్లమెంట్ స్థానాన్ని బిజెపికి ఇచ్చే అవకాశాలున్నట్టు ప్రచారం నడుస్తోంది. ఈ మేరకు బిజెపి నేతలు కూడా తామంటే తాము పోటీలో ఉంటామని ప్రకటనలు చేస్తున్నారు. ఇదే క్రమంలో సత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షులుగానున్న బికె.పార్థసారధికి పెనుకొండ అసెంబ్లీ టిక్కెట్టును ఈ సారి ఇవ్వలేదు. ఆయన్ను హిందూపురం ఎంపీగా నియమిస్తారన్న ప్రచారమూ ఉంది. అయితే ఆయన అసెంబ్లీ వైపే మొగ్గు చూపుతున్నారు. పొత్తులో హిందూపురం పార్లమెంట్ బిజెపికి ఇస్తే ఆయన్ను ఎక్కడి నుంచి బరిలో దింపుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ఆన్‌లైన్ సర్వేలో అనంతపురం అర్బన్ బికె.పార్థసారధి అయితే ఎలాగుంటుందని సర్వే నిర్వహించడం మరో ఆసక్తికరమైన అంశంగా మారింది. ఈ సర్వే అనంతపురం అర్బన్ పార్టీ ఇస్తోందా లేక సాధారణమైన సర్వేనేనా అన్నది తెలియాల్సి ఉంది.
టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్న జేసీ పవన్ రెడ్డి
అనంతపురం పార్లమెంట్‌కు ఎవరు టిడిపి అభ్యర్థి అన్నది ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 2019 ఎన్నికల్లో జెసి.పవన్‌కుమార్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. తొలిసారిగా రాజకీయ అరంగేట్రం చేసిన పవన్‌కుమార్‌రెడ్డి ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో తిరిగి ఆయనకే ఇస్తారా.. లేక కొత్త వారి వైపు చూస్తారా అన్నది తెలియాల్సి ఉంది. వైసిపి మాత్రం అనంతపురం అభ్యర్థిగా మాజీ మంత్రి శంకర నారాయణ పేరును ప్రకటించింది. ఆయనే అభ్యర్థి అయ్యే అవకాశముంది. సాధారణంగా అనంతపురం పార్లమెంటుకు ఎప్పుడూ బీసీలు అయితే బోయ సామాజిక తరగతికి చెందిన వారినే నియమిస్తారు. 2019లో ఆ రకంగా తలారి రంగయ్యను అభ్యర్థిగా నిలిపి జెసి.పవన్‌కుమార్‌రెడ్డిపై విజయం సాధించారు. ఇప్పుడు టిడిపి కూడా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు బరిలో దింపే ఆలోచన చేస్తోందని ప్రచారం నడిచింది. అయితే రాయదుర్గం అసెంబ్లీకే తిరిగి ఆయన్ను బరిలో నిలిపింది. ఈ మేరకు ఆయన పేరును టిడిపి అధిష్టానం ప్రకటించింది.
బీసీ అభ్యర్థుల్నే ఖరారు చేసే అవకాశం
కాలవ రాయదుర్గంకు వెళ్లడంతో అనంతపురం పార్లమెంటుకు జెసి.పవన్‌కుమార్‌రెడ్డి అభ్యర్థిగా ఉంటారన్న చర్చ నడుస్తోంది. జెసి.పవన్‌కుమార్‌రెడ్డి ఇప్పటి వరకు జిల్లాలో తానే అభ్యర్థినని చెప్పిన దాఖలాల్లేవు. గతకొంతకాలంగా ఆయన జిల్లాకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. అభ్యర్థిగా ప్రకటన వెలువడిన తరువాతనే వస్తారా లేక కొత్త అభ్యర్థి అయితే ఎవరన్నది టిడిపిలో చర్చ నడుస్తోంది. హిందూపురం పొత్తుల్లో బిజెపికిపోతే అనంతపురం అభ్యర్థి బరిలో బీసీ ఉంటారా లేక ఓసీ ఉంటారా .? అన్నది తేలాల్సి ఉంది.