AP Cabinet agenda being leaked: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈసారి కాస్త భిన్నమైన వాతావరణంలో సాగింది. ప్రభుత్వం అత్యంత రహస్యంగా ఉంచాల్సిన కేబినెట్ అజెండాలోని కీలక అంశాలు ముందస్తుగానే మీడియాకు చేరడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రివర్గ గోప్యతను కాపాడటంలో విఫలమైతే ఇక కేబినెట్ ఉండి ప్రయోజనం ఏమిటి అని ఆయన మంత్రులను నిలదీశారు. ప్రభుత్వ నిర్ణయాలు అధికారికంగా వెల్లడించే లోపే బయటకు పొక్కడం పాలనా పటిమకు సవాల్ అని ఆయన వ్యాఖ్యానించారు.
చారిత్రక హెచ్చరిక.. నాడు ఎన్టీఆర్.. నేడు నేను!
లీకుల పట్ల అసహనం వ్యక్తం చేస్తూ చంద్రబాబు గత జ్ఞాపకాలను గుర్తుచేశారు. నాడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బడ్జెట్ సమాచారం బయటకు వెళ్లినందుకు గాను మొత్తం మంత్రివర్గాన్నే రద్దు చేసిన చారిత్రక ఉదంతాన్ని ప్రస్తావించి ప్రస్తుత మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ప్రభుత్వ రహస్యాల రక్షణలో రాజీ పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు అని ఆయన కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. పాలనలో క్రమశిక్షణ తప్పితే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.
అధికార యంత్రాంగంపై అసహనం.. సిస్టమ్ మారాలి
కేవలం మంత్రులకే కాకుండా అధికారుల పనితీరుపై కూడా సీఎం బాబు క్లాస్ తీసుకున్నారు. కేబినెట్ భేటీ సమయానికి ఎజెండా కాపీలు మంత్రులకు అందకపోవడంపై అధికారులను తప్పుపట్టారు. ప్రతి అంశంపై మంత్రులకు ముందస్తు అవగాహన ఉండాలి. ఫైళ్లను సమర్పించడంలో ఆలస్యం ఎందుకు జరుగుతోంది అని అధికారులను మందలించారు. గతంలో సెక్రటరీ స్థాయి అధికారులు సబ్జెక్టుపై కమాండ్‌తో ఉండేవారని, నేడు ఆ చొరవ లోపించడం పాలనపై ప్రభావం చూపుతోందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎన్నికల నగారా.. యుద్ధానికి సిద్ధం!
సమావేశం చివరలో రాబోయే రాజకీయ సవాళ్లపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రులు తమ తమ శాఖల పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ వంటి కేంద్ర - రాష్ట్ర ఉమ్మడి పథకాలు ప్రజల్లోకి సమర్థవంతంగా వెళ్లేలా చూడాలన్నారు. ముఖ్యంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియను కేవలం ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా, ప్రజలతో మమేకమయ్యే వేదికగా మార్చుకోవాలని మంత్రులకు పిలుపునిచ్చారు.
