రాయలసీమలో జగన్‌పై తిరుగుబాటు మొదలైందని, రానున్న ఎన్నికల్లో జగన్‌ ఇంటికి వెళ్లడం ఖాయమని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజంపేట ప్రజల జీవితాలు బాగుపడాలంటే వైకాపా ఓడిపోవాలని, ఇప్పటికే ప్రజలు సిద్ధమయ్యారని చంద్రబాబు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతాపార్టీ ఉమ్మడి బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. రాజంపేట ప్రజలు జీవితాలు బాగుపడాలంటే మిథున్‌రెడ్డి ఓడిపోవాలన్నారు. వైసీపీకి ఓటు వస్తే ఏం జరుగుతుందో ప్రజలంతా ఆలోచించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాజంపేట జిల్లా ఏర్పాటు చేయకుండా ఇక్కడి వారికి అన్యాయం చేశారని, రాజంపేటను జిల్లా కేంద్రం చేసి అభివృద్ధి చేస్తామన్నారు. రాజంపేట, రాయచోటి, మదనపల్లె.. దేనికీ అన్యాయం చేయమని, ఎక్కడైనా ప్రజాభిప్రాయం మేరకే పాలన సాగించాలన్నారు.


రాజకీయ అనుభవం ఉన్న కుటటుంబం కిరణ్‌కుమార్‌ రెడ్డిదని, తాము వచ్చాకే అన్నమయ్య ప్రాజెక్టును బాగు చేసి బాధితులను ఆదుకుంటామన్నారు. పేదలకు రెండు. మూడు సెంట్లు ఇంటి జాగా ఇచ్చి, ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. గాలేరు - నగరి కాలువ పూర్తి చేస్తామని, కృష్ణా జలాలను తీసుకువస్తామని వివరించారు. ఏప్రిల్‌ నుంచి నాలుగు వేలు ఫించన్‌ ఇంటికే తెచ్చి ఇస్తామని చంద్రబాబు వెల్లడించారు. మూడు నెలలు బకాయిలు జూలైలో ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ మద్ధతుదారులు పింఛన్లు తీసేశారని, తాము వచ్చిన వారందరికీ ఇస్తామన్నారు. ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచేచ వరకు మూడు వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని స్పష్టం చేశారు. నిరుద్యోగులకు అండగా ఉంటామని, తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతామని చంద్రబాబు స్పష్టం చేశారు. 


అరాచక శక్తులను ఉపేక్షించవద్దు.. 


అరాచక శక్తులతో తాడో, పేడో తేల్చుకునేందుకు తాము సిద్ధమని, మీరంతా సిద్ధమా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. పొరపాటున వైసీపీకి ఓటేస్తే.. మనమంతా ఏమవుతామోనన్న ఆందోళన ప్రజల్లో ఉందన్నారు. ప్రజల జీవితాలు బాగుండాలంటే ఇక్కడ వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోవాలన్నారు. రామచంద్రరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి వల్ల అన్నమయ్య డ్యామ్‌ కొట్టుకుపోయిందని, వీరిని ఉపేక్షించవద్దని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రత్యర్థులకు డిపాజిట్లు రాకుండా చూడాలన్నారు. వైసీపీ ఓడిపోతే తామంతా కలిసి ఇక్కడే విజయోత్సవ సభ నిర్వహిస్తామన్నారు. పవన్‌ కల్యాణ్‌ను వైసీపీ నాయకులు ఎగతాళి చేస్తున్నారని, పవన్‌ను తిడితే మీకు రోషం లేదా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీని ఓడించేందుకు ప్రజలంతా సిద్ధం కావాలన్నారు. ఐదేళ్లలో ప్రజలకు ఏమైనా న్యాయం జరిగిందా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. గడిచిన ఐదేళ్లలో మద్యం రేట్లు భారీగా పెరిగిపోయాయని, ఈ డబ్బంతా ఎవరికి వెళుతోందన్నారు. పాపాల పెద్దిరెడ్డి ద్వారా సైకో జగన్‌కు మద్యం ఆదాయం వెళ్లిందని చంద్రబాబు స్పష్టం చేశారు.