Chandrababu challenges Jagan: "మెడికల్ కాలేజీలంటే జగన్‌కు తెలియదు. భూమి ఇస్తే మెడికల్ కాలేజీ పూర్తవుతుందని ఆయన అనుకుంటున్నారు. ఫౌండేషన్ వేయడం, రిబ్బన్ కట్ చేయడంతో ఏదో సాధించినట్లు చెప్పుకుంటున్నారు. 17 మెడికల్ కాలేజీలు ప్రారంభించామని చెప్పినా, ఒక్కటి మాత్రమే పూర్తయిం. అసెంబ్లీకి రండి, మెడికల్ కాలేజీలపై చర్చిద్దాం" అంటూ జగన్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యేల ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ చేశారు. ఉదయం జగన్ ప్రెస్‌మీట్‌లో చేసిన విమర్శలన్నింటికీ చంద్రబాబు సభలో కౌంటర్ ఇచ్చారు.
2024 ఎన్నికల్లో కూటమిసాధించిన విజయం చరిత్రాత్మకమని, ఈ సభ ఓట్ల కోసం కాదని, ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లు ప్రజలకు చెప్పేందుకే నిర్వహించినట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. "గత పాలకులు ప్రజా వేదికను కూల్చివేయడంతో విధ్వంసం మొదలైంది. అవినీతి, అక్రమాలు, అప్పులు, తప్పుడు కేసులతో రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టారు. వచ్చిన పెట్టుబడులను తరిమేసి, పరిశ్రమలు రాష్ట్రానికి రాకుండా చేశారు. దాదాపు 93 పథకాలను నిలిపివేసి, పేదలు, మధ్యతరగతి జీవితాలను నాశనం చేశారు" అని మండిపడ్డారు. "సూపర్ సిక్స్ అంటే హేళన చేశారు. పెన్షన్ల పెంపు అసాధ్యమన్నారు, తల్లికి వందనం పథకాన్ని ట్రోల్ చేశారు, మెగా డీఎస్సీ, దీపం, ఉచిత బస్సు పథకాలు అమలు కావన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేసింది" అని ఆయన స్పష్టం చేశారు.
2024 ఎన్నికల్లో 57% ఓటర్లు పాల్గొని, 94% స్ట్రైక్ రేట్‌తో కూటమికి 164 సీట్లు ఇచ్చి, ప్రతిపక్షానికి హోదా కూడా లేకుండా చేశారన్నారు. "సూపర్ సిక్స్ పథకాలు పేదలు, మధ్యతరగతి జీవితాలను మార్చేందుకు రూపొందించాము. పెన్షన్లు, తల్లికి వందనం, మెగా డీఎస్సీ, దీపం, ఉచిత బస్సు, అన్నదాత సుఖీభవ పథకాలు సూపర్ హిట్ అయ్యాయి" అని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారని.. కూటమి ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని చంద్రబాబు వివరించారు. అన్నా క్యాంటీన్ల ద్వారా 5.60 కోట్ల భోజనాలు అందించామని, దీపం-2 పథకం ద్వారా 2.45 కోట్ల సిలిండర్లు ఉచితంగా ఇచ్చామని, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 47 లక్షల రైతులకు రూ.3,173 కోట్లు అందించామని ఆయన వెల్లడించారు.
ఒక్క రైతుకూ యూరియా కొరత రాకుండా తాను చూసుకుంటానని చంద్రబాబు ప్రకటించారు. ఎంత యూరియా కావాలో అంతే వాడండంటూ రైతులకు సూచించారు. కేంద్రాన్ని అడిగిన వెంటనే యూరియా ఇచ్చిందని ఆర్ధిక కష్టాలున్నా.. అండగా నిలిచాం కాబట్టే ‘అన్నదాత సుఖీభవ’ సూపర్ హిట్ చేశామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చి మహిళల వంటింటి కష్టాలు తీర్చామని .. నేడు మళ్లీ దీపం-2 పథకం ద్వారా ఉచితంగా ప్రతీ ఏటా మూడు సిలిండర్లు ఇస్తున్నామన్నారు. ఇప్పటికే రూ.1,704 కోట్లు ఖర్చు చేసి.. 2.45 కోట్ల సిలిండర్లు మహిళలకు ఇచ్చామని తెలిపారు. ప్రతీ ఇంటా వెలుగులు నింపాం కాబట్టే.. దీపం పథకం సూపర్ హిట్ అయిందని తెలిపారు.
వైసీపీ కార్యాలయాలను మూసి వేసి..సోషల్ మీడియాలో విమర్శలు, ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని.. మండిపడ్డారు. రప్పా రప్పా అని హెచ్చరికలు డారీ చేస్తున్నారని అలాంటి వారిని వదిలి పెట్టేది లేదని చెబుతున్నారు.