AP Floods: ఏపీలోని వరద బాధిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. వరద చేసిన నష్టాన్ని పరిశీలించారు. వరద బాధితులను పరామర్శించారు. వరదల వల్ల సర్వం కోల్పోయిన బాధితులకు దాతలు సాయం చేయాలని కోరారు. 


ఆపన్నహస్తం అందించండి


ఇలాంటి దిక్కుతోచని సమయంలో వారికి అండగా నిలవాలని, ఆపన్న హస్తం అందించాలని దాతలకు పిలుపు ఇచ్చారు. తమ వంతుగా కూరగాయలు, బియ్యం అందించి వారి కడుపు నింపాలని, రెండు పూటలా భోజనం పెట్టాలని విజ్ఞప్తి చేశారు. రూపాయి రూపాయి పొదుపు చేసుకున్న సొమ్మంతా వరదల పాలైందని, ఇంట్లో సామానంతా తడిచి పోయిందని, తాగేందుకు నీరు కూడా లేక చాలా మంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నిస్సహాయ స్థితిలో ఉన్న వరద బాధితులు సాయం కోసం వేయి కళ్లతో చూస్తున్నారని పేర్కొన్నారు. వరదల్లో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో నిల్చున్నారని, ఎవరైనా ముందుకు వచ్చి వారికి సాయం చేయాలని మాజీ ముఖ్యమంత్రి అభ్యర్థించారు. 


సాయంలో సర్కారు విఫలం..


ఏపీలో తీవ్ర వరదలు వస్తే సహాయక చర్యలు చేపట్టడంలో కానీ, వరద బాధితులకు సాయం చేయడంలో కానీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి పాలనలో రాష్ట్రం అథోగతి పడుతోందని.. ఫ్యాన్ స్విచ్ బంద్ చేసి, సైకిల్ ను అధికారంలోకి తీసుకురావాలని బాబు కోరారు. మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర ప్రజలు సంతోషంగా జీవితం గడుపుతారని పేర్కొన్నారు. 


ఏపీకి తీవ్ర వరదలు..


గడిచిన రెండు, మూడు సీజన్ల నుండి ఏపీ వరదలతో తీవ్ర నష్టాన్ని చవి చూస్తోంది. రైతులు, తీర ప్రాంత ప్రజలే కాకుండా ప్రభుత్వం కూడా వివిధ రకాలుగా నష్టపోతోంది. గోదావరికి చరిత్రలో ఎన్నడూ లేనంత రీతిలో జులైలో అతి భారీ వరదలు వచ్చాయి. ప్రస్తుతం అయితే వరద ప్రభావం తగ్గినప్పటికీ ముప్పు మాత్రం ఇంకా తొలగిపోలేదు. ఆగస్టులో గోదావరికి, సెప్టెంబర్ నెలలో కృష్ణా నదికి వరదలు వస్తుంటాయి. తీవ్ర వర్షాలు పడ్డప్పుడు వరద ముప్పు ఉంటుంది. కానీ ఈసారి నెల, రెండు నెలల ముందే వరద వచ్చి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. అటు ప్రజలను, ఇటు ప్రభుత్వానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలలు ముందు ఉండటంతో వరద ముప్పు ఇంకా పొంచి ఉందనే చెబుతున్నారు అధికారులు. 


పరిష్కారంపై శ్రద్ధ పెట్టని ప్రభుత్వాలు..


జోరుగా కురుస్తున్న వర్షాలతో రెండు, మూడు సంవత్సరాల నుండి వరదల ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేస్తూనే ఉన్నాయి. గోదావరి, కృష్ణా నదుల్లో ఏదో ఒకదానికి వరద వస్తూనే ఉంది. దీర్ఘకాలంగా ఈ సమస్య ఉన్నప్పటికీ... వరద సమస్యపై ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. తాత్కాలిక చర్యలు తప్పా.. సమస్య నుండి ప్రజలను రక్షించాలన్న దీర్ఘకాలిక వ్యూహం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వరద సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి దానిని పరిష్కరించాలని బాధిత ప్రజలు కోరుతున్నారు.