Invitations to sam altman: ఆంధ్రప్రదేశ్ కోసం ఏ చిన్న అవకాశం కనిపించినట్లుగా ఉన్నా సరే దాన్ని అందిపుచ్చుకోవడానికి చంద్రబాబు, లోకేష్ పోటీ పడుతున్నారు. అందుకే ఏ వైపు నుంచి చాన్స్ ఉంటుందని అనుకున్నా.. అక్కడి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. చాట్ జీపీటీ సృష్టికర్త శామ్ అల్ట్ మన్ పెట్టిన ట్విట్టర్ పోస్టుపై వీరిద్దరూ తక్షణం స్పందించి ఏపీకి రావాలని పిలుపునిచ్చారు.
ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను ఉపయోగించుకుంటున్న తీరు అద్భుతమని శామ్ ఆల్ట్‌మన్ బుధవారం ఓ ట్వీట్ పెట్టారు. ఈ ట్వీట్ పై చంద్రబాబు స్పందించారు. ఏఐ రంగంలో భారరతదేశం ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభిస్తోందని.. అలాగే ఆంధ్రప్రదేశ్ AI-ఆధారిత పురోగతికి కేంద్రంగా మారడానికి సిద్ధంగా ఉందని చంద్రబాబు ట్వీట్ చేశారు. మీ తదుపరి భారతదేశ పర్యటనలో అమరావతికి ఆహ్వానిస్తున్నామన్నారు. కేవలం AI మాత్రమే కాదు; ఆంధ్రప్రదేశ్ క్వాంటం టెక్నాలజీలో కూడా నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉందన్నారు.
నారా లోకేష్ కూడా శామ్ ఆల్టమన్ కు ఆహ్వానం పంపారు. ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఏఐలో ఎమర్జింగ్ పొజిషన్ లో ఉందని.. ఏఐ రంగంలో అవకాశాలను ఎక్స్‌ప్లోర్ చేయాలని లోకేష్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో యువతకు మరిన్ని ఉద్యోగాలను సృష్టించడానికి మన రాష్ట్రంలో AI వృద్ధిని పెంపొందించడానికి మా ఎకో సిస్టమ్‌ను మెరుగుపర్చడానికి, నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉన్నామన్నారు.
చంద్రబాబు నాయుడు ఏఐ , క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాన్ని ఆంధ్రప్రదేశ్ కు ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అల్టమన్ ట్వీట్ ను ఉపయోగించుకున్నారు. ఆయన ఇండియా పర్యటనకు వస్తే ఏపీకి ఆహ్వానించేందుకు ఓ గ్రౌండ్ రెడీ చేసుకున్నారు. ఓపెన్ ఏఐతో చరిత్ర సృష్టించిన శామ్ అల్టమన్.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ విభాగంలో విప్లవం తెచ్చారు. అయితే ఆ రంగంలో ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందని ఆయన భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు చంద్రబాబు, లోకేష్ ఏపీకి ఆహ్వానం పలుకుతున్నారు.