Welfare Schemes in Andhra Pradesh | ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాల పేరుమీద జరుగుతున్న తాయిలాల పంపకం ఖజానాకు పెనుభారంగా మారుతోంది. గతంలో వైసిపి, ప్రస్తుత కూటమి పోటీపడి మరీ అప్పుల మీద అప్పులు చేస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. నిజానికి అవసరంలో ఉన్న పేదలను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. కానీ దానకర్ణులు అనిపించుకోవడం కోసం సరైన రాబడి రాకుండానే ఇలా ప్రభుత్వాలు సంక్షేమ పథకాల కోసం అప్పుల మీద అప్పులు చేస్తూ వెల్ఫేర్ స్కీమ్ అమలు చేస్తున్న తీరు మేధావి వర్గాల్లో ఏపీ భవిష్యత్తుపై ఆందోళన పెంచుతోంది.
పథకాలు అమలు చేసినా జగన్ కు దక్కని ఫలితం
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2024 లో దిగిపోయేసరికి కేవలం సంక్షేమ పథకాలు కోసం ప్రతి ఏటా 70 వేల కోట్ల వరకూ ఖర్చుపెట్టినట్టు ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. దీనికోసం వివిధ కార్పొరేషన్లలోని డబ్బులు సైతం వాడేసారని, ప్రభుత్వ ఆస్తులు తాకట్టుపెట్టి మరీ అప్పులు తెచ్చారని టిడిపి, జనసేన తీవ్రంగా ఆరోపించేవి. ఏపీలో అభివృద్ధి పూర్తిగా పడకేసింది అనేది వారి ప్రధాన విమర్శ గా ఉండేది. అమ్మ ఒడి, నాడు -నేడు లాంటి పథకాల వల్ల చాలామందికి మేలు జరిగిన మాట వాస్తవమే అయినా మిగిలిన అనేక పథకాల వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది అనేది చాలామంది ఎనలిస్ట్ లు, ఆర్ధిక వేత్తల అభిప్రాయం. అటు అమరావతి పక్కకు పోయి, మూడు రాజధానుల వ్యవహారం బెడిసి కొట్టి, పోలవరం ప్రాజెక్టు అతిగతీ లేని పరిస్థితుల్లో పడిపోవడం తో చివరికి సంక్షేమ పథకాలు సైతం జగన్ ప్రభుత్వాన్ని కాపాడలేకపోయాయి. అప్పట్లో రాష్ట్రం లోని రోడ్ల పరిస్థితులపై సామాన్యులు, ఆటో డ్రైవర్లు, వాహన దారులు తీవ్ర అసంతృప్తి వెళ్ళబుచ్చేవారు. విచిత్రంగా వీరిలో చాలామంది సంక్షేమ పథకాల లబ్ది దారులే కావడం విశేషం. అంటే ప్రజలకు సంక్షేమంతో పాటుగా అభివృద్ధి, కనీస సౌకర్యాలు ముఖ్యమనేది చాలా స్పష్టంగా పాలకులకు తెలియజేసిన ఎన్నికల ఫలితాలు అవి.
తాయిలాల ట్రాప్ లో చంద్రబాబు
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రో డెవలప్మెంట్ లీడర్గా చంద్రబాబు కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎన్ని విమర్శలు వచ్చినా ఆర్ధిక పరమైన సంస్కరణలకు ఏమాత్రం వెనుకాడే వ్యక్తి కాదని చంద్రబాబు నాయుడు పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు పట్టం కట్టడానికి ముఖ్యమైన కారణం ఇదే. 2024 ఎన్నికల్లోనూ ప్రజలు చంద్రబాబుపై రాష్ట్ర అభివృద్ధి అనే యాంగిల్ లోనే ప్రధానంగా ఓట్లు వేశారు. కేవలం సంక్షేమ పథకాలు కోసమే అయితే ఆ ఓటు జగన్ కే వేసి ఉండేవారన్న అభిప్రాయం చాలా మంది రాజకీయ నేతల నుండి వెలువడుతోంది. కానీ చంద్రబాబు మాత్రం సంక్షేమ పథకాలలో కూడా తన ముద్ర చూపే దిశగా ఒకదాని వెంట ఒకటి పథకాలు అమలుచేసుకుంటూ వెళ్తున్నారు. 2024 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే డెస్ప రేషన్ తో ఇచ్చిన హామీలపై అప్పట్లోనే మేధావివర్గాల నుంచి విమర్శలు వెలువడ్డాయి. ముఖ్యంగా 20లక్షల మంది యువకులకు నెల నెలా 3000 చొప్పున ఇస్తామన్న నిరుద్యోగ భృతి, 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు 1500 చొప్పున ఇస్తామన్న హామీ లపై అవెలా సాధ్యమన్న విమర్శలు బలంగా వచ్చాయి. దానికి తగ్గట్టే ఇటీవల రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కూడా " మహిళలకు 1500 చొప్పున ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలంటూ " ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి చెప్పకనే చెప్పారు. ఎన్నడూ లేనట్టు మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లతో ప్రవేశ పెట్టిన 2025-26 ఏపీ బడ్జెట్లో కూడా వీటి ఫై స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ బడ్జెట్లో అధిక భాగం సంక్షేమ పథకాలకు కేటాయించారు. ఏపీ జీవనాడి అయిన పోలవరానికి బడ్జెట్ లో కేటాయించింది 6300 కోట్లు మాత్రమే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నామని చెబుతూనే ఆర్థిక మంత్రి రెవిన్యూ లోటు 33 వేల కోట్లు, ద్రవ్య లోటు దాదాపు 80000 కోట్లుగా పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వం ముందు భారీ లక్ష్యాలు
సంక్షేమ పథకాల మాట ఎలా ఉన్నా ఏపీ ప్రభుత్వం నుంచి ప్రజలు కోరుకుంటున్నవి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడం, రాజధాని కి ఒక రూపం రావడం. వీటితోపాటు గుంతలు లేని రోడ్లు,లోపాలు లేని విద్య వైద్య సౌకర్యాలు. ప్రస్తుతం ఒకరిపై ఒకరు పోటీపడి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలు ప్రభుత్వం నుంచి కోరుకుంటున్న అంశాలకు అడ్డుకట్టుగా మారిపోయే ప్రమాదం లేకపోలేదని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ సంక్షేమ పథకాల హామీ లను మరింతగా పెంచే పనిలో కచ్చితంగా రాష్ట్రం లోని పార్టీలు పడతాయి. నిజం చెప్పాలంటే జగన్,చంద్రబాబు ఒక విధమైన పులి స్వారీ చేస్తున్నారనే చెప్పాలి. సవారీ చెయ్యలేరు.. అలాగని కిందకు దిగనూ లేరు.
ఉచితాలపై అన్ని పార్టీలూ చర్చించి నిర్ణయం తీసుకోవాలి : లంకా దినకర్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా ఉచిత హామీలతో పరుగులు పెట్టడంపై అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందని అభిప్రాయపడ్డారు సీనియర్ రాజకీయవేత్త, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్. ఆయన ప్రస్తుతం జాతీయ పార్టీ బిజెపిలో సభ్యుడిగా ఉన్నారు. ఇలా అన్ని పార్టీలు ఉచితాలకు సంబంధించిన హామీలపై ఒక బ్రేకుల్లేని విధానంతో ముందుకు సాగడం భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థకు చేటు చేయడంతో పాటు పేదలను మరింత పేదలుగా మార్చేసే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు.