Chandrababu in Telugu diaspora : ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తన పర్యటనను జ్యూరిచ్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంతో ఘనంగా ప్రారంభించారు. 20 దేశాల నుంచి తరలివచ్చిన ప్రవాస తెలుగు వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తెలుగు వారు నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేసే శక్తివంతమైన కమ్యూనిటీగా ఎదిగారని కొనియాడారు. తాను గతంలో విజన్ 2020 , ఐటీ రంగం గురించి మాట్లాడినప్పుడు విమర్శలు వచ్చాయని, కానీ ఆనాడు తీసుకున్న నిర్ణయాల వల్లే నేడు 195 దేశాలలో తెలుగు బిడ్డలు ఉన్నత స్థితిలో ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఇటీవలి ఎన్నికల్లో కూటమి సాధించిన 93 శాతం స్ట్రైక్ రేట్ విజయం వెనుక ప్రవాస తెలుగు వారి కృషి మరువలేనిదని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి పూర్వవైభవం తేవాలన్న పిలుపుతో ఎన్నారైలు ఆలోచించకుండా తరలివచ్చి కూటమి కోసం పని చేశారని, కొందరు నేతలు కార్యకర్తలతో సమానంగా కేసులు కూడా ఎదుర్కొన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ సహకరించారని, బీజేపీ కూడా తోడవడంతోనే ఈ అద్భుత విజయం సాధ్యమైందని స్పష్టం చేశారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని తిరిగి పునర్ నిర్మించడంపై ఆందోళన ఉన్నా, గత 18 నెలల్లో మళ్లీ ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరించామని ధీమా వ్యక్తం చేశారు.
పెట్టుబడుల స్వర్గధామంగా ఏపీ
రాష్ట్ర అభివృద్ధి కోసం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో ముందుకు సాగుతున్నామని, దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే దక్కాయని చంద్రబాబు ప్రకటించారు. గూగుల్ వంటి గ్లోబల్ దిగ్గజం ఏపీకి రావడంతో పాటు, ఆర్సెల్లార్ మిట్టల్ లక్ష కోట్ల రూపాయలతో ఉక్కు పరిశ్రమను, ఏఎం గ్రీన్ సంస్థ 10 బిలియన్ డాలర్లతో గ్రీన్ అమోనియా ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నాయని వెల్లడించారు. మొత్తం 22 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల లక్ష్యంగా కసరత్తు చేస్తున్నామని, ఇది సాకారమైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
భవిష్యత్ సాంకేతికత - యువతకు పెద్దపీట
టెక్నాలజీలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడంలో తెలుగు వారు ముందున్నారని, రాబోయే కాలంలో ఏఐ , క్వాంటం, స్పేస్, డ్రోన్ టెక్నాలజీలకు ఏపీ చిరునామాగా మారబోతోందని ముఖ్యమంత్రి వివరించారు. ముఖ్యంగా డ్రోన్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయం, వైద్య రంగాల్లో సేవలు అందించేందుకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అనుమతుల విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. తన ప్రభుత్వంలో లోకేష్, రామ్మోహన్ నాయుడు, టీజీ భరత్ వంటి విద్యావంతులైన యువతకు ప్రాధాన్యత ఇస్తున్నామని, యువత సవాళ్లను ఎదుర్కోవడం నేర్చుకోవాలని హితవు పలికారు.
సంక్షేమం.. సంస్కరణలు
తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు ప్రారంభించడం గర్వకారణమని, నేడు ప్రధాని మోదీ నాయకత్వంలో 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ ఎకానమీగా అవతరిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజారోగ్యం కోసం సంజీవని ప్రాజెక్టు, ప్రకృతి సేద్యం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారం, మరియు 958 టీఎంసీల నీటి నిల్వలతో నీటి భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. విదేశాల్లో స్థిరపడిన ప్రవాసులు తమ మాతృభూమిని, మారుమూల గ్రామాలను మర్చిపోవద్దని, ఆ గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు.