ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి అయిన వైఎస్‌ వివేకానంద రెడ్డిని అవినాశ్‌ రెడ్డే చంపించారని, అందుకు సాక్ష్యాలన్నీ ఉన్నాయని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తేల్చి చెప్పింది. వివేకానంద రెడ్డి హత్య విషయంలో నేరుగా పాల్గొన్న యాదాటి సునీల్‌ యాదవ్‌ (A2) బెయిల్‌ పిటిషన్ కు కౌంటర్ గా తెలంగాణ హైకోర్టులో సీబీఐ పిటిషన్‌ వేసింది. ఈ పిటిషన్ లో ఎన్నో సంచలన విషయాలను దర్యాప్తు సంస్థ బహిర్గతం చేసింది. తమ విచారణలో భాగంగా తేలిన విషయాలను సీబీఐ ఆ పిటిషన్‌లో వివరించింది. హత్యకు సంబంధించి రూ.40 కోట్లతో ఒప్పందం కుదరడంలో సునీల్ యాదవ్ కీలకంగా వ్యవహరించాడని తెలిపింది.


సీబీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. వివేకానందరెడ్డిని అవినాశ్‌ రెడ్డి అడ్డు తొలగించుకోవాలని అనుకోవడానికి, తన ఎంపీ సీటుకు అడ్డు రావడమే కారణమని సీబీఐ పేర్కొంది! వైఎస్ వివేకాను చంపేందుకు దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి (A5)తో కలిసి అవినాశ్‌ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి కుట్ర పన్నారని వివరించింది. ఆ ప్లానును దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి అమలు చేశారని తేలిందని వెల్లడించారు. ఆ సమయంలో వివేకానందరెడ్డితో విభేదిస్తున్నవారిని ఏకతాటిపైకి తెచ్చారని వివరించింది.


అలా సన్నిహితంగా ఉంటున్నా ఆయనపై కోపం ఉన్న ఎర్ర గంగిరెడ్డి (A1), వివిధ కారణాలతో వివేకాపై ఆగ్రహంగా ఉన్న యాదాటి సునీల్‌ యాదవ్‌ (A2), డ్రైవర్‌ షేక్‌ దస్తగిరి (A4 - అప్రూవర్‌), ఉమా శంకర్‌ రెడ్డిలను కూడగట్టి, వీరితోనే ప్రత్యక్షంగా హత్యలో పాల్గొనేలా చేశారని సీబీఐ వెల్లడించింది. వజ్రాల పేరుతో సునీల్ యాదవ్ విలువైన రాళ్ల వ్యాపారం చేసేవాడని, వద్దని వివేకానంద రెడ్డి హెచ్చరించడంతో ఆయనపై సునీల్ కోపం పెంచుకున్నాడని పేర్కొంది. గంగిరెడ్డితో కలిసి వివేకా హత్యకు ప్లాన్ చేశారని కౌంటర్‌ పిటిషన్ లో తెలిపింది. హత్యకు సంబంధించి రూ.40 కోట్లతో ఒప్పందం కుదరడంలో సునీల్ యాదవ్ కీలకంగా వ్యవహరించాడని సీబీఐ తెలిపింది. 


హత్యకు ముందు నిందితులందరూ అవినాష్ రెడ్డి ఇంట్లోనే


వివేకానంద రెడ్డిని హత్య చేసిన రోజు నిందితులందరూ వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్లుగా సీబీఐ తన కౌంటర్‌లో తెలిపింది. వివేకా హత్యకు కదిరి నుంచి గొడ్డలి తీసుకురావడానికి వెళ్లిన దస్తగిరి రాక కోసమే సునీల్‌యాదవ్‌ అవినాష్‌ రెడ్డి ఇంట్లో ఎదురు చూస్తున్నట్లు తేలిందని తెలిపింది. వివేకా హత్య ఘటన వెలుగులోకి రావడానికి కొంత సమయం ముందు (2019 మార్చి 15 తెల్లవారుజామున) నిందితులు శివశంకర్‌రెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి తదితరులు అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నారని పేర్కొంది.


View Pdf


వివేకాను గొడ్డలితో నరకడాన్ని హార్ట్ ఎటాక్ గా చిత్రీకరించడం, బాత్రూంలో జారి పడిపోయారని చెప్పడం, రక్తపు మరకలను క్లీన్ చేయించడంలో అవినాశ్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డి పాత్ర గురించి సీబీఐ గతంలోనే వెల్లడించింది. 


ఇటీవలే అవినాశ్ రెడ్డికి సమన్లు, విచారణ


కొద్ది వారాల క్రితమే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఎంపీ అవినాశ్‌ రెడ్డిని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఆయన కాల్‌డేటా ఆధారంగా కీలక ప్రశ్నలు వేసినట్లుగా సమాచారం. తాజాగా సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌లో అవినాశ్‌ రెడ్డి ఏ సమయంలో ఎవరెవరికి ఫోన్ చేసి ఎంత సేపు మాట్లాడారో ఫోన్‌ నంబర్లతో సహా వెల్లడించింది. సీబీఐ విచారణ సందర్భంగా అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు నాలుగు గంటల పాటు విచారణ చేశారు. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టు అవినాష్ రెడ్డి ఆ సమయంలో చెప్పారు. మళ్లీ ఎప్పుడు పిలిచినా వస్తానని వారికి చెప్పినట్టు మీడియాకు తెలిపారు.


మళ్లీ ఈ నెల 24వ తేదీన హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలని మరోసారి సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసుల్ని వాట్సాప్‌లో పంపారు. ఆ రోజున మధ్యాహ్నం మూడు గంటలకు హాజరు కావాలని నోటీసుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. జనవరి నెల 28న అవినాష్ రెడ్డిని తొలిసారిగా ప్రశ్నించారు. ఆ సమయంలో ఆయన కాల్ లిస్ట్ కు సంబంధించిన ప్రశ్నలు వేశారు. ఆయన ఇచ్చిన సమాధానంతో  ఏపీ సీఎం జగన్ పీఏ కృష్ణమోహన్ రెడ్డి, భారతి పీఏ నవీన్ లను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఆ తర్వాత అవినాష్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేయడం సంచలనాత్మకంగా మారింది.


View Pdf