CBI officials question Chevireddy : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలపై నమోదైన కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసును విచారిస్తున్న  సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సోమవారం  ప్రశ్నించింది.  ప్రస్తుతం విజయవాడ జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారులు కోర్టు నుండి ప్రత్యేక అనుమతి పొందారు.

Continues below advertisement

స్కాం జరిగినప్పుడు టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న చెవిరెడ్డి                       

గత ప్రభుత్వ హయాంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డులో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉండేవారు. ఆ సమయంలో నెయ్యి కొనుగోలుకు సంబంధించి టెండర్ నిబంధనలను మార్చడం, అర్హత లేని సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టడంపై సీబీఐ అధికారులు ఆయన్ను ప్రధానంగా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఉత్తరాఖండ్‌కు చెందిన  బోలేబాబా డెయిరీ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి సరఫరా చేసే అవకాశం ఎలా కల్పించారనే కోణంలో విచారణ సాగినట్లుగా తెలుస్తోంది.   

Continues below advertisement

దాదాపుగా మూడు గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ                    

ముగ్గురు డీఎస్పీలు, ముగ్గురు సీఐలతో కూడిన సీబీఐ సిట్ బృందం.. సుమారు మూడు గంటల పాటు చెవిరెడ్డిని ప్రశ్నించింది. నెయ్యి నాణ్యత పరీక్షల్లో వచ్చిన తప్పుడు నివేదికల వెనుక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయి? కొనుగోలు కమిటీ నిర్ణయాల్లో రాజకీయ జోక్యం ఉందా? అనే అంశాలపై ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. కొన్ని కీలక పత్రాలను కూడా ఆయన ముందు ఉంచి వివరణ కోరినట్లు సమాచారం.  

లిక్కర్ స్కాంలో జైల్లో ఉన్న చెవిరెడ్డి                                                

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పటికే  మద్యం కేసు లో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్నారు. ఇప్పుడు కల్తీ నెయ్యి కేసులో కూడా సీబీఐ ఆయనను విచారించడం ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి వంటి ఉన్నతాధికారులను విచారించిన సిట్, ఇప్పుడు రాజకీయ నేతలపై దృష్టి సారించడంతో తదుపరి ఎవరికి నోటీసులు అందుతాయనేది ఉత్కంఠగా మారింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పడిన ఈ సీబీఐ సిట్ బృందం, గత ఐదేళ్లలో సుమారు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని ప్రాథమికంగా గుర్తించింది. ఇందులో జరిగిన రూ. 250 కోట్ల కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేసింది.