Cash for Vote Case | హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాత్ర ఉందని నిందితుడు జెరూసలేం మత్తయ్య సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్‌కి బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబుతో సహా ఇతర నేతలపై కేసులు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణను చేపట్టాలని కోరారు. 2016లో చంద్రబాబు, రేవంత్‌రెడ్డి తనను పిలిపించి ఓటుకు నోటు గురించి వివరించారని, ఓ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో పార్టీకి ఓటు వేసేలా ఒప్పించాలని చెప్పారన్నారు.
అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.5 కోట్లు ఇచ్చి తమకు అనుకూలంగా ఓటు వేసేలా ఒప్పించాలని తనను ప్రోత్సహించి నేరం చేపించారని కీలక విషయాలు వెల్లడించారు. ఓటుకు నోటు కేసులో నిందితుడు మత్తయ్య తన పాత్రను అంగీకరించి, ఒప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తప్పులను ఒప్పుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను రద్దు చేయాలని, ఈ కేసుకు సంబంధించి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తన లేఖలో కోరారు.
అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఓటుకు నోటు కేసు నమోదు చేసినందుకు ప్రతిగా అప్పటి ఏపీ ప్రభుత్వం ఫోన్‌ట్యాపింగ్ కేసు పెట్టిందన్నారు. ఈ అంశాన్ని తెలంగాణ తరఫున వాదించిన లాయర్ మేనక గురుస్వామి సుప్రీంకోర్టులో ప్రస్తావించకపోవడం విచారకరం అన్నారు. అందుకే తుది తీర్పు ఇచ్చే ముందు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని మత్తయ్య విజ్ఞప్తి చేశారు.
మత్తయ్య తన లేఖలో కీలకంగా మరో విషయాన్ని ప్రస్తావించారు. “ఈ కేసులో చంద్రబాబు, నారా లోకేశ్, టీడీపీ నాయకులు, అప్పటి ఏపీ ప్రభుత్వంలో పనిచేసిన పోలీసు అధికారులు, ఇంటెలిజెన్స్ విభాగం, న్యాయవాదుల పేర్లను సైతం ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలి. చట్టప్రకారం కేసులు నమోదు చేయాలి. నన్ను అరెస్టు చేసినట్టుగానే వారినీ అరెస్టు చేసి, నన్ను ప్రేరేపించిన వారి పాత్రను పూర్తిగా విచారించి, కఠినంగా శిక్షించాలి. ప్రజాప్రతినిధుల ఓట్లను డబ్బు, పదవుల ఆశ చూపి కొనుగోలు చేయకుండా చూడాలని’ కోరారు.
రేవంత్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలి..
ఓటుకు నోటు కేసులో తనను, ఇతర నిందితులతోపాటు విచారించాల్సిందిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరుతూ రాసిన లేఖలో జెరూసలేం మత్తయ్య కొన్ని కీలక డిమాండ్లు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని పదవి నుండి తప్పించాలి. కేసులో కీలకంగా ఉన్న వేంనరేందర్‌రెడ్డి, వేంకీర్తన్‌రెడ్డి, ఉదయ్‌సింహా వంటి వ్యక్తులు ప్రభుత్వ పదవుల్లో కొనసాగుతున్నారు. కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశముంది కనుక వీరిని వెంటనే తమ అధికారాల నుంచి తొలగించాలి. ముఖ్యంగా రేవంత్‌రెడ్డిని సీఎం పదవి నుండి తప్పించాలి.
చంద్రబాబు, లోకేష్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలి
చంద్రబాబు సెల్‌ఫోన్, కాల్ రికార్డులు, వాయిస్ ఫోరెన్సిక్ రిపోర్ట్, అలాగే పట్టుబడిన 50 లక్షల నగదు ఘటన, ఆ డబ్బును ఎవరు సమకూర్చారనే అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. తనను తెలంగాణ ఏసీబీకి అప్పగించకుండా, విజయవాడకు బలవంతంగా తరలించి అజ్ఞాతంలో ఉంచడం దారుణం. లోకేశ్, కిలారి రాజేశ్, రేవంత్ అనుచరుడు జిమ్మీబాబు నన్ను రహస్య ప్రాంతానికి తరలించారు. అప్పటి ఏపీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, డీజీపీ, టాస్క్‌ఫోర్స్ బృందాలు, ఇతర ఎమ్మెల్యేలు, క్యాబినెట్ మంత్రులంతా ఈ కుట్రలో భాగం. కనుక వీరందరినీ కేసులో నిందితులుగా చేర్చాలి. నాపై ఒత్తిడి తెచ్చి కేసీఆర్, కేటీఆర్‌లపై విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌లో ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదు చేయించారు. వ్యక్తిగతంగా స్టీఫెన్సన్‌ను కలిశానని బలవంతంగా స్టేట్‌మెంట్ రాయించారు. తెల్లపేపర్లపై సంతకాలు తీసుకున్నారు. భార్యకు నామినేటెడ్ పదవి, పిల్లల చదువకు సాయం చేస్తామని చెప్పి కోర్టులో 164 పిటిషన్ వేశారు. ఈ వ్యవహారంలో టీడీపీ న్యాయవాదులు కనకమేడల, దమ్మాలపాటి, అప్పటి అడ్వకేట్ జనరల్‌లు పాత్రపై విచారణ జరిపించాలి.
కేసును విచారించిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి శివశంకర్‌ను నిందితుడిగా చేర్చాలి. కేసులో ఉన్న సాక్ష్యాధారాలను పూర్తిగా పరిశీలించకుండా, ఇన్‌కెమెరా విచారణల ద్వారా న్యాయాన్ని తప్పుదారి పట్టించారు. శివశంకర్ రిటైర్ అయిన తర్వాత ఆయనను తెలంగాణ పోలీస్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్‌గా నియమించారు. టీఆర్‌ఎస్ పార్టీపై జరిగిన కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నాను. అధికారంలోకి వచ్చిన పార్టీని డబ్బు ఆశ చూపి కూలదోయాలని ప్రయత్నంచడం దారుణం. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన అందరిపై చర్యలు తీసుకోవాలి.
అప్రూవర్‌గా గుర్తించండి సార్..తాను కోర్టుకు సమగ్ర సహకారం అందించేందుకు సిద్ధమని, సాక్షిగా ఉన్న నన్ను అప్రూవర్‌గా గుర్తించండి. కేసు వివరాలు వెల్లడించేందుకు రెడీగా ఉన్నాను. ‘పార్టీ ఇన్ పర్సన్’ పిటిషన్ దాఖలు చేసినా, సుప్రీంకోర్టులో నా మాట చెప్పే అవకాశం కల్పించలేదు. ఈ కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పర్యవేక్షణలో విచారణ చేయాలని ఆదేశాలు ఇవ్వాలి. లేకపోతే ఏపీ, తెలంగాణలో కాకుండా ఢిల్లీ హైకోర్టులోనైనా విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని’ సీజేఐ బీఆర్ గవాయ్‌కి రాసిన లేఖలో నిందితుడు మత్తయ్య విజ్ఞప్తి చేశారు.