Angallu Case On Chandrababu: చిత్తూరు జిల్లా అంగళ్లు సమీపంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి ఘటనల్లో నమోదైన కేసులను పోలీసులు మూసివేశారు. పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఆయనపై చేసినవి తప్పుడు ఫిర్యాదులుగా పోలీసులు నిర్ధారణకు వచ్చాు. ప్రతిపక్ష నేత హోదాలో 2023 ఆగస్టు 9న చంద్రబాబు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు వచ్చారు. కురబలకోట మండలం అంగళ్లు సర్కిల్‌లో చంద్రబాబు వాహనాన్ని వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. చంద్రబాబుపైకీ రాళ్లు రువ్వారు. భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించి అడ్డుకోవడంతో ఆయనకు ఎటువంటి గాయాలూ కాలేదు.
ప్రాజెక్టుల సందర్శనకు వస్తున్న చంద్రబాబుకు వినతిప్రతం ఇచ్చేందుకు తాము వెళ్తుంటే.. టీడీపీ నాయకులు తమపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారని, చంద్రబాబు రెచ్చగొట్టడం వల్లే ఈ దాడులు జరిగాయని వైసీపీకి చెందిన ఉమాపతిరెడ్డి మూడు రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముదివేడు పోలీసులు చంద్రబాబుపై ఏకంగా హత్యాయత్నం సహా పలు నాన్‌బెయిలబుల్ సెక్షన్లతో నాలుగు కేసులు నమోదు చేశారు. మాజీ మంత్రులు దేవినేని ఉమ, అమరనాథ్‌రెడ్డి సహా 20 మంది క్రియాశీల టీడీపీ నాయకులపైనా కేసులు పెట్టారు.
తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాలకు పలువురు క్రియాశీల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీసులు పూర్తి స్థాయిలో విచారించారు. చంద్రబాబు పర్యటనను వైసీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడమే కాకుండా.. ఆయనపై రాళ్లు రువ్వినట్లు వీడియోల ద్వారా గుర్తించారు. దాడులకు దిగిన వారిపై కేసులు నమోదు చేయకపోగా బాధితుడిగా ఉన్న చంద్రబాబుపైన, ఇతర టీడీపీ నాయకులపై కేసులు బనాయించినట్లు గుర్తించారు. హత్యాయత్నం కేసుతో పాటు.. మిగిలిన మూడు కేసులూ తప్పుడువేనని తేల్చి వాటిని మూసివేస్తూకోర్టుకు నివేదిక సమర్పించారు.
చంద్రబాబుపై, టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసి.. చివరికి వారిపైనే కేసులు పెట్టడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా పోలీసులు, ప్రభుత్వం పట్టించుకోలేదు. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు.. కోర్టు ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చింది.