బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యలను పరామర్శించడానికి వెళ్లిన సమయంలో జరిగిన పరిణామాల నేపధ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో పాటు 33 మంది తెలుగుదేశం పార్టీ నేతలపై పాత గుంటూరు పోలీసులు కేసులు నమోదు చేశారు.  ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, నక్కా ఆనంద్‌బాబు, ధూళిపాళ్ల నరేంద్ర, తెనాలి శ్రావణ్ కుమార్, అనితలు కేసులు నమోదైన వారిలో ఉన్నారు. వీరిపై పలు అభియోగాలు నమోదు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం, అనుమతి లేకుండా గుమికూడటం, అలాగే పోలీసులను వారి విధులను నిర్వహించకుండా అడ్డుకోవడంతో పాటు  శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. అదే సమయంలో కరోనా  నిబంధనలు ఉల్లంఘించారని నక్కా ఆనంద్‌బాబు, ధూళిపాళ్ల నరేంద్రతోపాటు మరో పది మంది నేతలపై కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టారు. 


ఆగస్టు 15వ తేదీన ఓ వైపు స్వాతంత్ర్య వేడుకలు జరుగుతున్న సమయంలో మరో వైపు గుంటూరు పరమయ్య కుంట ప్రాంతంలో  శశికృష్ణ అనే ఉన్మాది బీటెక్ విద్యార్థిని రమ్యను కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. రమ్యకు నివాళులర్పించి.. కుటుంబసభ్యులను పరామర్శించేందుకు  నారా లోకేష్ వెళ్లారు. పరామర్శించి బయటకు వచ్చిన సమయంలో ఆయన ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు గుమికూడటంతో లోకేష్‌ను అరెస్ట్‌ చేసి పోలీసులు ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం వరకూ అదుపులోనే ఉంచుకుని ఆ తర్వాత  151 సీఆర్‌పీసీ చట్టం కింద నోటీసులు జారీ చేసి వదిలిపెట్టారు. ఈ రోజు ఆ ఘటనల వీడియోలను పరిశీలించిన పోలీసులు కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నారు. 


అంతకు ముందు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రమ్య మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే రమ్య కుటుంబానికి న్యాయం చేయాలంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్‌ను అడ్డుకున్నారు. టీడీపీ నేతలను అప్పుడే పోలీసుల అరెస్ట్ చేశారు. ఈ ఆందోళనపై కొత్త పేట పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టారు. మహిళలకు భద్రత కల్పించలేని ప్రభుత్వం.. వారికి భరోసా ఇవ్వడానికి వెళ్తున్న వారిని మాత్రం అడ్డుకోవడానికి.. వారిపై కేసులు పెట్టడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 


నమోదు చేసిన కేసుల విషయంలో పోలీసులు తదుపరి చర్యలు ఏమి తీసుకుంటారన్నదానిపై స్పష్టత లేదు. నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.