Case On Kodali Nani :  గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిపై కేసు నమోదు  అయింది.   తమను వేధించి కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ మాజీ వలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వలంటీర్ల ఫిర్యాదు మేరకు కొడాలి నానిపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను మరో ఇద్దరు వైసీపీ నేతలపై 447,506,R/w34 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.


అభ్యంతరకభాషతో  టీడీపీకి టార్గెట్ అయిన కొడాలి నాని 


కొడాలి నాని అభ్యంతరకరమైన భాషలో టీడీపీ నేతల్ని తిడుతూ ఉంటారు. మంత్రిగా ఉన్నప్పుడు.. మంత్రి పదవి పోయిన తర్వాత కూడా ఆయన అదే భాష ఓడారు. ఎన్నికల్లో ఆయనతో పాటు వైసీపీ కూడా ఓడిపోయిన తర్వాత మొదటి సారి మీడియాతో మాట్లాడినప్పుడు మామూలుగానే మాట్లాడారు. అయితే రెండు రోజుల కిందట తాడేపల్లి లో పార్టీ ఆఫీసులో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం తర్వాత ఏం పీకుతారో పీక్కోండి అనే భాష వాడారు. తామే టార్గెట్ చేశామని ఆయన హెచ్చరించారు. ఇలా మాట్లాడిన ఆయనపై ఒక్క రోజులోనే వాలంటీర్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం ఆసక్తికరంగా మారింది. 


బలవంతంగా వాలంటీర్లతో రాజీనామాలు చేయించినట్లుగా ఆరోపణలు              


ఎన్నికలకు ముందు వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు విధించింది. ఈ కారణంగా చాలా మంది వాలంటీర్లు వెంటనే తమ పోస్టులకు రాజీనామా చేసి వైసీపీ తరపున పని చేయడం ప్రారంభించారు. నిజానికి సంగం మందిపైగా వాలంటీర్లు రాజీనామా చేయలేదు. వీరిని నియమించిన వారు వైసీపీ నేతలే కావడంతో వారు చెప్పడంతో చాలా చోట్ల రాజీనామాలు చేశారు. చేయని చోట్ల వైసీపీ నేతలు ఒత్తిడి  చేసి మరీ రాజీనామాలు చేయించారు.  వీరంతా వైసీపీ తరపున  పని చేసే వారు కావడంతో టీడీపీ నేతలు పట్టించుకోవడం లేదు. కానీ తమ ఉపాధి పోయిందని మళ్లీ తమను విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్లు టీడీపీ నేతల్ని కోరుతున్నారు. ఎక్కడ కనిపిస్తే అక్కడ వినతి పత్రాలిస్తున్నారు. 


పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న వాలంటీర్లు                                         


రాజీనామాలు చేసిన వారిని మళ్లీ తీసుకోవడానికి నిబంధనలు అంగీకరించవని.. అయితే బలవంతంగా రాజీనామాలు చేయించారని అంటున్నారు కాబట్టి.. ఎవరు అలా ఒత్తిడి చేశారో వారి పేర్లతో పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. వారి సూచనల మేరకు చాలా చోట్ల..  వాలంటర్లు వైసీపీ నేతలుపై ఫిర్యాదులు ఇస్తున్నారు. ఎక్కడా ఇప్పటి వరకూ కేసులు పెట్టినట్లుగా బయటకు సమాచారం రాలేదు కానీ.. కొడాలి నానిపై కేసు పెట్టిన విషయం మాత్రం వైరల్ అవుతోంది.