Minister RK Roja: మంత్రి రోజాపై బుడబుక్కల సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే బేషరత్తుగా రోజా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సామజిక వర్గం నేతలు మంత్రి రోజాపై నందిగామ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ కులాన్ని కించపరిచేలా మంత్రి వ్యాఖ్యలు చేశారంటూ బుడబుక్కల సంఘం నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రిపై తక్షణం చర్యలు తీసుకోవాలని బుడబుక్కల సంఘం అధ్యక్షుడు సత్యం డిమాండ్ చేశారు. మంత్రి రోజా తమ కులానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏమైందంటే?
జనసేన అధినేతపై మంత్రి రోజా విమర్శలు చేయడం కొత్తేం కాదు. ఎప్పుడు ఎక్కడ కార్యక్రమం జరిగినా మంత్రి రోజా ఒంటికాలిపై లేస్తారు. తాజాగా సోమవారం కృష్ణా జిల్లా పర్యటన భాగంగా మంత్రి రోజా జనసేన అధినేత పవన్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. పవన్ కల్యాణ్‌ను బుడబుక్కల వారితో పోలుస్తూ విమర్శలు చేశారు. సంక్రాంతి వస్తే గ్రామాల్లోకి బుడబుక్కల వాళ్లు వస్తుంటారని, రాష్ట్రంలో ఎక్కడ చూసిన కనిపిస్తుంటారని అన్నారు. జనసేన అధినేత పవన్ బుడబుక్కల వాడని, కేవలం టీడీపీ కోసం పని చేస్తుంటారని విమర్శించారు. పవన్ ఒక బుడబుక్కల వాడు అయితే, చంద్రబాబు తనయుడు మరో బుడబుక్కల వాడు అంటూ మంత్రి వ్యాఖ్యలు చేశారు. బుడబుక్కల వారు (పవన్ కల్యాణ్, నారా లోకేష్‌ను ఉద్దేశించి) ఏం చేస్తారో చెప్పలేరంటూ విమర్శించారు.
ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారో పవన్, లోకేష్ చెప్పలేరంటూ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. మైక్ కనిపిస్తే పిచ్చోళ్లా ఊగిపోతారంటూ మాట్లాడారు. వారికి తెలిసింది ఒక్కటేనని, జగన్‌పై బురద చల్లడమేనని ధ్వజమెత్తారు. 2019 ఎన్నికల ముందు ఓ బుడబుక్కల వాడు మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డిని ఓడిస్తామని, జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ మాట్లాడారని, వారి పరిస్థితి ఏంటో ఇప్పుడు వారికే తెలియదని పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి అన్నారు. జగన్ సీఎం అవలేరని, ఇదే నా శాసనం అంటూ పవన్ గంభీరాలు పలికారని, కానీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, పవన్ మాత్రం శాసన సభ గేట్లు కూడా తాకలేకపోయారని విమర్శించారు. అదీ జగనన్న పవర్ అంటూ రోజా మాట్లాడారు.
గతంలోను పవన్‌పై రోజా విమర్శలు
పవన్ కల్యాణ్‌పై రోజా విమర్శలు చేయడం కొత్తేం కాదు. చాలా మార్లు పవన్‌పై రోజా విమర్శలు చేశారు. తల్లిని తిట్టిన వ్యక్తితో పొత్తు పెట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని.. టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించి తనను నమ్మిన అభిమానులను జనసేనాని మోసం చేశారని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. జైలుకు పరామర్శించేందుకని వెళ్లి ప్యాకేజీ మాట్లాడుకున్నారని పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వ్యక్తి.. రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పవన్ కల్యాణ్.. సీఎం జగన్ గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు.
అయితే ఎప్పుడు ఓ సామాజిక వర్గంతో పోలుస్తూ విమర్శలు చేయలేదు. కృష్ణా జిల్లా పర్యటన భాగంగా రోజా పవన్ కల్యాణ్‌పై ఘాటు విమర్శలు చేశారు. బుడబుక్కల సామాజిక వర్గంతో పోలుస్తూ విమర్శించారు. ఈ విషయం కాస్తా వివాదానికి కారణమైంది. పవన్‌పై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై బుడబుక్కల సంఘం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ సామాజిక వర్గాన్ని కించపరిచేలా వ్యాక్యలు చేశారని మండిపడుతున్నారు. తక్షణమే రోజా తమ కులానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తు్న్నారు.