BRS leader Praveen Kumar supported AP IPS Sunil Kumar  :  మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు నమోదైన హత్యాయత్నం కేసులో సీఐడీ మాజీ  డీజీ సునీల్ కుమార్ పై కేసు నమోదు చేయడంపై తెలంగాణ బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ స్పందించారు. సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. సునీల్ కుమార్ సిన్సియర్ అధికారి అని కితాబిచ్చారు. రఘురామకృష్ణరాజు అంశం మూడేళ్లు కోర్టుల్లో ఉందని.. ఇప్పుడు కొత్తగా ఏం మార్పు వచ్చిందని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. 


దేశంలో కక్ష సాధింపు రాజకీయాలకు పోలీసు అధికారులు బలవుతున్నారని అన్నారు. గుజరాత్ లో సంజీవ్ భట్ అనే పోలీసు అధికారి ఉదంతాన్ని ప్రవీణ్ కుమార్ ప్రస్తావించారు. రఘురామకృష్ణరాజు తనపై పార్లమెంట్లో ఆధారాలు లేకుండా 2021లో ఆరోపణలు చేశారన్నారు. ఉన్న పళంగా కేసులు విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు.  





 


రఘురామకృష్ణరాజును 2021లో పీవీ సునీల్ కుమార్ నేతృత్వంలోని సీఐడీ అధికారులు హైదరాబాద్ లో అరెస్టు చేసి గుంటూరు సీఐడీ ఆఫీసుకు తీసుకెళ్లారు. తర్వాత రోజు కోర్టులో హాజరు పరిచారు. అయితే కస్టడీలో ఉంచుకున్న రోజు రాత్రి ఆయనపై కస్టోడియల్ టార్చర్ కు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రిలో చేసిన రిపోర్టుల్లో గాయాలు ఉన్నట్లుగా తేలడంతో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి ఆయనతపై కస్టోడియల్ టార్చర్ కు పాల్పడ్డారని విచారణ కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. 


అప్పటి సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడుతూండటంతో  సీఐడీ అధికారులే సుమోటోగా కేసు పెట్టి ఆయనను అరెస్టు చేశారు. రాజద్రోహం కేసు పెట్టారు. ఈ వ్యవహారాం అంతా అప్పట్లో సంచలనం అయింది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో లీగల్ ఒపీనియన్ తీసుకుని కేసు నమోదు చేశారు.                


ఇలా కేసు నమోదు చేయడంపై పీవీ సునీల్ కుమార్ కూడా సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనకు మద్దతుగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం.. పీవీ సునీల్ కుమార్ సీఐడీ డీజీగా ఉన్నప్పుడు చేసిన  పనులన్నింటినీ  ప్రవీణ్ కుమార్ సమర్థిస్తారా అని ప్రశ్నిస్తున్నారు.