ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బైజూస్ అనే ఎడ్‌టెక్ సంస్థతో చేసుకున్న ఒప్పందంపై పవన్ కల్యాణ్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మెగాడీఎస్సీని ప్రకటించలేదని.. ఒక్క టీచర్ ని కూడా రిక్రూట్ చేయలేదని గుర్తు చేశారు. ఇవన్నీ చేయకుండా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయి ఉన్న ఓ స్టార్టప్‌కు మాత్రం వందల కోట్లు కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. బైజూస్‌కు కాంట్రాక్టులు ఇచ్చే విషయంలో స్టాండర్డ్ ప్రోటోకాల్ ను వైసీపీ ప్రభుత్వం పాటించిందా? అని ప్రశ్నించారు. అసలు ఎన్ని కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి? ఎవరెవరు షార్ట్ లిస్ట్ అయ్యారనే వివరాలు పబ్లిక్ డోమైన్‌లో ఉన్నాయా? అని పవన్ కల్యాణ్ నిలదీస్తూ ట్వీట్ చేశారు.


అయితే, దీనిపై తాజాగా బొత్స సత్యనారాయణ స్పందించారు. సుదీర్ఘ ట్వీట్‌తో ఎద్దేవా చేస్తూ పవన్ కల్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు. నేను నీకు ట్యూషన్ చెబుతానని, ఎప్పటి హోంవర్క్ అప్పుడు చేయాలంటూ ట్వీట్ చేశారు. తాను ఏడు పాఠాలను చెబుతున్నానని, ఆ హోంవర్క్ కంప్లీట్ చేయాలంటూ ట్వీట్ చేశారు.


‘‘డియర్ పవన్ కల్యాణ్ ఈరోజు నుంచి నేను నీకు ట్యూషన్లు చెబుతాను. కానీ, ఏ రోజు హోంవర్క్ ఆ రోజు కంప్లీట్ చేస్తానని ప్రామిస్ చేయాలి. ఈ ఏడు పాఠాలను ఈరోజు కంఠస్థం చెయ్యి!


పాఠం 1: పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ టెండర్‌లకు సంబంధించి అర్హత లేదా పరిధిని నిర్ణయించే అధికారాన్ని అందించిన ప్రపంచంలోని ఏకైక ప్రభుత్వం ఏపీ గవర్నమెంట్ ప్రభుత్వం అని మీరు తెలుసుకోండి.


పాఠం 2: రూ.100 కోట్లకు పైబడిన ఏదైనా గవర్నమెంట్ టెండర్ యొక్క పరిధి, అర్హతని డిసైడ్ చేయడం అనేది హైకోర్టు అనుమతితో నియమించిన స్పెషల్ జడ్జితో (ఈ కేసులో జస్టిస్ శివశంకర్ రావు) పాస్ అవుతుంది.


పాఠం 3: టెండర్ స్పెసిఫికేషన్స్ పబ్లిక్ డొమైన్‌లో ఉంచుతారు. కంపెనీలకు కామెంట్ చేయడానికి లేదా రియాక్ట్ కావడానికి 21 రోజుల సమయం ఉంటుంది. దీన్ని పోస్ట్ చేసిన న్యాయమూర్తి స్వయంగా టెండర్ స్పెసిఫికేషన్స్ ని లాక్ చేస్తారు.


పాఠం 4: ప్రపంచంలోనే జుడిషియల్ ప్రివ్యూ కలిగి ఉన్న ఏకైక ప్రభుత్వం మాదేనని హైలైట్ చేయడానికి మేం నిజంగా గర్వపడుతున్నాం. దీనిద్వారా అన్ని కంపెనీలకు సమన్యాయం జరిగుతుంది.


పాఠం 5: అలాగే, బేసిక్ గూగుల్ సెర్చ్ చేయడం ద్వారా మీకు ఈ పర్టిక్యులర్ టెండర్ కోసం ప్రభుత్వాన్ని సంప్రదించిన అన్ని కంపెనీల వివరాలు తెలుసుకోవచ్చు. ఆ వివరాలు ఆగస్టు 2022 నుండి పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయి. ఆ లింక్‌ను మీరు షేర్ చేసుకోవడం వల్ల ఆ సమాచారాన్ని మీరు మిస్ కాలేరు. (https://judicialpreview.ap.gov.in/findings-recommendations/)


పాఠం 6: ఏపీ విద్యా రంగానికి సంబంధించి ప్రతి ఒక్కరూ చూడగలిగేలా రిజల్ట్స్ రిలీజ్ అయ్యే అత్యంత పారదర్శకమైన విభాగం మా వద్ద ఉందని చెప్పుకోడానికి మేం గర్విస్తున్నాం!


పాఠం 7: ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలకి చూస్తే మీ టీచర్ల పట్ల జాలేస్తోంది. కానీ నేను చెప్పినట్లుగా మీరు శ్రద్ధగా మీ బ్రెయిన్ కి సానపట్టేలా ప్రామిస్ చేసినంత కాలం నేను మీకు ట్యూషన్లు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను!’’ అని బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు.