TDP Three Member Committee:   విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల వైసీపీ నేత అంబటి రాంబాబుతో భేటీ కావడంపై చెలరేగిన రాజకీయ వివాదం నడుమ ఆయన కీలక వివరణ ఇచ్చారు. అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన టీడీపీ త్రిసభ్య కమిటీ ముందు హాజరైన బోండా ఉమ, తన వైఖరిని స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ పార్టీ లైన్‌ను దాటలేదని, భవిష్యత్తులో కూడా దాటే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. చంద్రబాబు ఆదేశాలను శిరసావహిస్తానని, అనవసరంగా ఈ విషయాన్ని వివాదాస్పదం చేశారని ఆయన పేర్కొన్నారు.

Continues below advertisement

 ముద్రగడ సభలో పరిచయం.. వక్రీకరించారంటూ ఆవేదన 

కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు వెళ్లిన సమయంలో అక్కడ వైఎస్సార్‌సీపీ నేతలను కలవాల్సి వచ్చిందని బోండా ఉమ కమిటీకి వివరించారు. అంబటి రాంబాబుతో తనకు దాదాపు మూడు దశాబ్దాలుగా వ్యక్తిగత పరిచయం ఉందని, ఆ క్రమంలోనే ఆయన తన వద్దకు వచ్చి పలకరించారని తెలిపారు. తాము కేవలం కాపు సామాజికవర్గ సమస్యలపైనే సాధారణంగా మాట్లాడుకున్నామని, అంతకుమించి ఎటువంటి రాజకీయ చర్చలు జరగలేదని వివరణ ఇచ్చారు. అయితే, కొందరు దుష్టశక్తులు ఈ చిన్న విషయాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో తన మాటలను వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Continues below advertisement

 పార్టీకి కట్టుబడి ఉంటాను.. తప్పు చేయలేదు 

కూటమి ప్రభుత్వంలో క్రమశిక్షణే ప్రాధాన్యమని పేర్కొన్న బోండా ఉమ, ఎవరైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. తాను దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉన్నానని, ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయలేదని, మున్ముందు కూడా చేయబోనని చెప్పుకొచ్చారు. ముద్రగడ సభ వద్ద జరిగిన సంఘటన అనుకోకుండా జరిగిందని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటానని త్రిసభ్య కమిటీకి హామీ ఇచ్చారు.

 పార్టీ హెచ్చరికలు              

టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలతో సొంత పార్టీ నాయకులు సఖ్యతగా కనిపిస్తే క్యాడర్‌కు తప్పు సంకేతాలు వెళ్తాయని అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఈ  కారణంగానే బోండా ఉమను వివరణ కోరడం, ఆయన త్రిసభ్య కమిటీ ముందుకు  వచ్చి వివరణ ఇచ్చారు.  గతంలో అంబటితో భేటీపై కాస్త ఘాటుగానే స్పందించిన బోండా ఉమ, కమిటీ ముందు మాత్రం పూర్తిగా తగ్గి వ్యాఖ్యానించడంపై పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధిష్టానం కఠిన వైఖరి వల్లే ఆయన ఈ రకంగా  యూటర్న్  తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.  ఏపీ రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల నేతలతో వేదికలు పంచుకోవడంపై కఠినంగా ఉండాలని నిర్ణయించిన టీడీపీ అధిష్టానానికి బోండా ఉమ ఇచ్చిన వివరణతో ఈ వివాదానికి తాత్కాలికంగా తెరపడినట్లే కనిపిస్తోంది. త్రిసభ్య కమిటీ తన నివేదికను పార్టీ అధినేత చంద్రబాబుకు సమర్పించనుంది.