Bogapuram vs Vijayawada Airports: భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం 2026 జూన్‌కు మొదటి దశ పూర్తి చేసి విమానాలు రన్‌వేలో ల్యాండ్ చేసేందుకు సిద్ధమవుతుంటే, కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ నిర్మాణం మాత్రం ఏళ్లకేళ్లు సాగుతోంది. ఐదున్నరేళ్ల క్రితం రూ.470 కోట్ల బడ్జెట్‌తో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం పనులు మొదలయ్యాయి. 30 నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. కానీ 68 నెలలు దాటినా ముగిసే పరిస్థితిలో లేదు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ ను GMR గ్రూప్ నిర్మిస్తోంది. రూ.4,590 కోట్లతో వేగంగా పనులు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే 90 శాతానికిపై పనులు పూర్తి అయ్యాయి. వచ్చే నెలలో విమానాల ట్రయల్ రన్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2,800 ఎకరాల్లో 1,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం, అంతర్జాతీయ సర్వీసులు, కార్గో హబ్‌గా మారేందుకు సిద్ధమవుతున్న ఈ ప్రాజెక్ట్, ఉత్తరాంధ్ర కు మైలురాయిగా మారనుంది.
గన్నవరం విమానాశ్రయం టెర్మినల్ మాత్రం ఆలస్యంగా జరుగుతోంది. 2019లో మొదలైన టెర్మినల్ నిర్మాణం, లోపలి సిమెంట్ స్ట్రక్చర్ పూర్తయినా, వెలుపలి స్టీల్ ఫ్రేములు, గ్లాస్ ఫాసాడ్ పనులు మాత్రం సాగుతున్నాయి. తాజా అంచనాల ప్రకారం, మరో ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. అంటే 2025 జూన్ లక్ష్యం కూడా దాటిపోతుంది. ఈ జాప్యం వల్ల రన్‌వే విస్తరణ చేసినా నిరుపయోగంగా పడిపోయింది. దిల్లీ, ముంబైకి మాత్రమే బోయింగ్ సర్వీసులు పరిమితమయ్యాయి. అంతర్జాతీయ ఫ్లైట్లు, పెద్ద ఎయిర్‌లైన్స్ సర్వీసులు ఆలస్యమవుతున్నాయి. విజయవాడ–హైదరాబాద్ రూట్‌లో ట్రాఫిక్ పెరిగినా దానికి తగ్గట్లుగా చర్యలు తీసుకోలేకపోతున్నారు.
కేంద్ర ఏవియేషన్ మంత్రి కి రామ్మోహన్‌నాయుడు స్వయంగా రెండుసార్లు విజయవాడకు వచ్చి పరిశీలించారు. పనులు ఆలస్యంగా చేస్తున్న కాంట్రాక్టర్ ను హెచ్చరించారు. ఏడాదిన్నరలో కొత్త గడువులు పెట్టారు, 2025 జూన్ డెడ్‌లైన్‌లు జారీ చేశారు. కానీ పనులు మాత్రం ఊపందుకోవడం లేదు. నిర్లక్ష్యం ఎందుకన్న విమర్శలు ప్రజల నుంచి వస్తున్నాయి.