Attack On Satya Kumar :   పోలీసుల సాయంతోనే ఉద్దేశపూర్వకంగానే తమపై దాడి చేశారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. దాడి ఘటన తర్వాత విజయవాడలో మడియాతో మాట్లాడిన ఆయన తుళ్లూరు నుంచి తాము విజయవాడకు వెళ్తున్న సమయంలో మందడం దగ్గర మూడు రాజధానుల శిబిరం దగ్గర పోలీసులు తమ కాన్వాయ్‌ను ఆపారని అన్నారు. ఎందుకు ఆపారని పోలీసుల్ని అడుగుతున్న సమయంలో వెనుక వైపు నుంచి వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడికి పాల్పడ్డారన్నారు. పోలీసుల సహకారంతో ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా దాడి చేశారని సత్యకుమార్ ఆరోపించారు. ఈ దాడి పై డీఎస్పీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కారుపై రాళ్లదాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదన్నారు. 


బీజేపీ నేతలపై దాడికి జగన్ రెడ్డి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బీజేపీ నేతలు హెచ్చరించారు.  వైఎస్ వివేకానందరెడ్డిని చంపినట్లుగా ఆదినారాయణ రెడ్డిని చంపాలని ప్లాన్ చేశారని ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు. ఏపీలో వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేస్తామని ప్రకటించారు.  


ఈ దాడి ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై వైసీపీ మూకలు దాడులకు పాల్పడుతున్నాయి. అక్కడే ఉన్న పోలీసులు దుండగులను ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. 


 





 అసలు దాడి ఎలా జరిగిందంటే ?


భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో దాడి జరిగింది. మందడం గ్రామంలో మూడు రాజధానులకు మద్దతుగా  కొంత మంది శిబిరం నిర్వహిస్తున్నారు. అమరావతి రైతుల ఉద్యమం ప్రారంభమై 1200 రోజులుఅవుతున్న సందర్భంగా .. వారికి సంఘిభావం ప్రకటించేందుకు సత్యకుమార్ వచ్చారు. ఆ తర్వాత తుళ్లూరులో పార్టీ నేత ఒకరిని పరామర్శించడానికి వెళ్లారు. ఆయన తుళ్లూరు నుంచి మందడంలోని మూడు రాజధానుల మద్దతు శిబిరం మీదుగా వెళ్తారన్న సమాచారం ముందుగానే తెలియడంతో కొంత మంది ముందుగానే ఆయనను అడ్డుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సత్యకుమార్ కాన్వాయ్ మందడం దగ్గరకు రాగానే కొంత మంది అడ్డుకున్నారు. మరికొంత మంది రాళ్లతో దాడి చేశారు. దీంతో సత్యకుమార్ కాన్వాయ్ కర్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి.  ప్రమాదాన్ని గుర్తించిన సత్యకుమార్ డ్రైవర్ కారును ముందుకు తీసుకెళ్లిపోయారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలపైనా దాడి చేశారు. బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న సత్యకుమార్ వాహనాన్నే ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోవడం వెనుక వ్యూహం ఉందని బీజేపీ నేతలు అనుమానిస్తున్నారు.  దాడి చేస్తున్న దృశ్యాల వీడియోలు వైరల్ అవుతున్నయి. ఈ అంశంపై నందిగం సురేష్ కూడా  స్పందించారు. ముందుగా తమ వారిపై దాడి చేశారని ఆయన ఆరోపిస్తున్నారు.