Bill Gates visited farm in Amaravati :  బిల్ గేట్స్  అమరావతి పర్యటనలో  సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లతో భేటీ అనంతరం ఆయన నేరుగా ఉండవల్లి గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. అక్కడ డ్రోన్ల వినియోగం, ఏఐ  ఆధారిత సాగు విధానాలను రైతుల ద్వారా నేరుగా అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వ్యవసాయంలో ఈ స్థాయి సాంకేతికతను వాడటం లేదని, ఆంధ్రప్రదేశ్ ఇందులో ముందుందని ఆయన కొనియాడారు.                                           

పర్యటనలో భాగంగా బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రుచులను ఆస్వాదించారు. వ్యవసాయ క్షేత్రం వద్ద రైతులు,  అధికారులతో కలిసి ఆయన స్థానిక టిఫిన్ రకాలను రుచి చూశారు. ముఖ్యంగా వేడివేడి  పుణుగులు,  బొండాలను ఆయన ఎంతో ఇష్టంగా రుచి చూశారు.           

 

గతంలో కూడా ఆయన ఇండియా పర్యటనలో స్థానిక టీ , వడలను రుచి చూశారు. అదే బాటలో అమరావతిలో కూడా స్థానిక రుచులకు ఆయన ఫిదా అయ్యారు.

 సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్   కేంద్రాన్ని సందర్శించినప్పుడు, డేటా అనలిటిక్స్ ద్వారా పౌర సేవలను అందిస్తున్న తీరును చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భూ రికార్డులను బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ఎలా భద్రపరుస్తున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలను పరిశీలించిన ఆయన, అమరావతిని 'గ్రీన్ అండ్ బ్లూ' సిటీగా అభివృద్ధి చేసే ప్రణాళిక బాగుందని ప్రశంసించారు.                                                                              

 ముఖ్యమంత్రి చంద్రబాబుతో దాదాపు మూడు దశాబ్దాల అనుబంధం ఉన్న బిల్ గేట్స్, ఈ పర్యటనతో ఏపీ అభివృద్ధిలో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేశారు.                                                                                             

సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రజారోగ్య సేవలను మెరుగుపరచడం, వ్యవసాయంలో టెక్నాలజీని విస్తరించడంపై ఈ పర్యటనలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పర్యటన ముగించుకుని ఆయన తిరిగి ముంబైకి బయలుదేరి వెళ్లారు.