Bill Gates praises Chandrababu :  మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ అమరావతి పర్యటనలో పలు ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. బిల్ గేట్స్ సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి నేరుగా ఆయన వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో కలిసి సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కేంద్రాన్ని సందర్శించారు. ఆర్టీజీఎస్ ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న రియల్ టైమ్ మానిటరింగ్, డేటా మేనేజ్‌మెంట్ ,  పౌర సేవల పంపిణీ తీరును ఆయన ఆసక్తిగా గమనించారు. ఆర్టీజీఎస్‌లోని భారీ డిస్ప్లే వాల్స్‌పై ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ టెక్నాలజీ ప్రాజెక్టుల ప్రజెంటేషన్లను బిల్ గేట్స్ చూశారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సేవలను చేరువ చేయడం, అవేర్ 2.0 వ్యవస్థ,   బ్లాక్ చెయిన్ టెక్నాలజీని ఉపయోగించి ల్యాండ్ రికార్డులను భద్రపరుస్తున్న తీరును అధికారులు వివరించారు. ముఖ్యంగా భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ విధానం పారదర్శకతను పెంచుతుందని ఆయన అభినందించారు. కుప్పంలో అమలు చేస్తున్న సంజీవని హెల్త్ ప్రాజెక్టు ఫలితాలను చూసి  దట్స్ నైస్ అంటూ కితాబిచ్చారు. ట్యాక్స్ కలెక్షన్ ప్రక్రియలో డిజిటలైజేషన్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు.          

Continues below advertisement

 సచివాలయం సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి, మంత్రులు, కార్యదర్శులతో జరిగిన ప్రత్యేక సమావేశంలో బిల్ గేట్స్ ప్రసంగించారు.  భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధాని మోదీ ,  సీఎం చంద్రబాబు నాయుడు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన కొనియాడారు. డిజిటల్ గవర్నెన్స్ ,  విపత్తు నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ వాడుతున్న సాంకేతికత ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం రూపొందించిన  స్వర్ణాంధ్ర విజన్ 2047 రోడ్ మ్యాప్‌ను ఆయన పరిశీలించి, అమరావతి రాజధానిలో 30 శాతం  గ్రీన్ అండ్ బ్లూ  ప్రణాళిక బాగుందని వ్యాఖ్యానించారు.      

Continues below advertisement

 మధ్యాహ్న భోజనం అనంతరం, బిల్ గేట్స్ ఉండవల్లి పరిసరాల్లోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి, సాగులో డ్రోన్ల వినియోగం మరియు ఏఐ సాంకేతికతను పరిశీలించారు.  

అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున జ్ఞాపికను అందజేసి వీడ్కోలు పలికారు. మధ్యాహ్నం సుమారు 3:30 గంటల ప్రాంతంలో బిల్ గేట్స్ గన్నవరం విమానాశ్రయం నుండి తిరిగి ముంబైకి బయలుదేరి వెళ్లారు. ఏపీ ప్రభుత్వం ,గేట్స్ ఫౌండేషన్ మధ్య కుదిరిన ఈ అవగాహన భవిష్యత్తులో ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో మరిన్ని విప్లవాత్మక మార్పులకు బాటలు వేయనుంది.