Pawan Kalyan : 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే చాలా అద్భుతాలు చేయొచ్చు కానీ వైసీపీ ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ నుంచి ఆర్డీవో వరకు సినిమా థియేటర్ల వద్ద నిలబెట్టిందని విమర్శించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ . తన సినిమా రిలీజ్‌ అవుతుంటే చాలు కలెక్టర్‌ నుంచి ఆర్డీవో వరకు అందరినీ రంగంలోకి దించుతారని ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన జనసేన జనవాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం  వ్యవస్థలు వాడడంలేదని, తన సినిమా ఆపేందుకు ప్రభుత్వ అధికారులకు డ్యూటీలు వేస్తోందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయిన పవన్.. ప్రత్యర్థులపై దాడి చేసేందుకు అధికార దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. 5, 10 రూపాయల సినిమాలను ఆపేందుకు పనిచేస్తున్న సర్కార్ ప్రజల కోసం పనిచేస్తే సగటు మనిషి సమస్యలు పరిష్కారం అయ్యేవన్నారు.  


యువత ప్రజా సమస్యలపై పోరాడాలి  


వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఉంటే పవన్ విమర్శించారు. సమస్యల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే బూతులు తిట్టడం వస్తుందన్నారు. తాము ఇక్కడే పెరిగిన వాళ్లమే అన్నారు. ఒకటి రెండు మాట్లాడగలమన్నారు. అన్న వస్తే అద్భుతాలు జరగుతాయన్నారు కానీ ఎక్కడా జరగడంలేదని పవన్ ఎద్దేవా చేశారు.  మద్యపానం నిషేధం ఏమైందని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై యువత పోరాడాలని పవన్ కోరారు. భీమవరంలో డంపింగ్‌యార్డు సమస్య ఎందుకు పట్టించుకోలేదని మండిపడ్డారు. వైసీపీరి పనులు చేయాలనే చిత్తశుద్ధిలేదన్నారు. తుందూరు ఆక్వా ఫ్యాక్టర బంగాళాఖాతంలో కలిపేస్తామన్న ముద్దుల మావయ్య ఏం చేశారని ప్రశ్నించారు. జగన్ మావయ్యకు జేబులో నుంచి డబ్బులు తీయడం రాదని, నోట్లో నుంచి మాటలు మాత్రం బాగా వస్తాయని పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. 


అంతా భ్రమే 


ఏపీలో బ్రిడ్జిలు శిథిలావస్థకు చేరుకున్నాయని పవన్ కల్యాణ్‌ అన్నారు. వాటికి ప్రభుత్వం మరమ్మతులు చేయించాలని సూచించారు. ఇంకా బ్రిటీష్‌ కాలంలో కట్టిన వంతెనలే ఆధారమన్నారు. రాష్ట్ర సమస్యలపై ప్రశ్నిస్తే ఎస్సీలపై అట్రాసిటీ కేసులు పెడుతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాలకు చెందినవారు తమ సమస్యలను జనసేన దృష్టికి తీసుకొస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ అధికారంలోకి రాగానే నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సంత్సరాలు రోడ్లపై తిరిగిన వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏదో మేలు చేస్తారని అందరూ భావించారని అది భ్రమేనని తేలిపోయిందన్నారు. జనవాణిలో అవినీతి, ఇళ్ల పట్టాలు, మౌలిక వసతులు గురించి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని పవన్ అన్నారు. 


ఇసుక దోపిడీ 


వైసీపీ ప్రభుత్వం ఇసుక విధానాన్ని మరింత సరళతరం చేస్తామని చెప్పి ఇసుకను దోచేస్తుందని పవన్ కల్యాణ్ విమర్శించారు. లారీ ఇసుక రూ.28 వేల నుంచి 36 వేల వరకు ధరకు అమ్ముతున్నారని ఆరోపించారు. ఎస్సీలకు వైసీపీ అండగా ఉంటుందనుకుంటే వారిపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. గోపాలపురంలో 25 మంది ఎస్సీ యువకులపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టారన్నారు.