Bhimavaram DSP transferred: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ ఆర్.జి. జయసూర్యపై ఎట్టకేలకు బదిలీ వేటు పడింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ఫిర్యాదు చేసిన దాదాపు రెండు నెలల తర్వాత ఈ బదిలీ జరగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అక్టోబర్ నెలలో డీఎస్పీ వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్, ఆయనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీని , జిల్లా ఎస్పీని ఆదేశించారు. తాజాగా జయసూర్యను బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో రఘువీర్ విష్ణును నూతన డీఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
భీమవరం డీఎస్పీ జయసూర్యపై ప్రధాానంగా మూాడు ఆరోపణలు డీఎస్పీ జయసూర్యపై ప్రధానంగా మూడు ఆరోపణలు వచ్చాయి. భీమవరం పరిధిలో భారీగా పేకాట శిబిరాలు నిర్వహించేవారికి ఆయన వెన్నుదన్నుగా నిలుస్తున్నారని, దీనికి ప్రతిగా నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారని జనసేన నాయకులు పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే, పోలీసు పరిధిలోకి రాని సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటూ కొందరి పక్షాన వ్యవహరిస్తున్నారని, కూటమిలోని కీలక నేతల పేర్లను వాడుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారన్నది పవన్ కళ్యాణ్ ప్రధాన ఆరోపణ. శాంతి భద్రతల పరిరక్షణలో డీఎస్పీ విఫలమయ్యారని డిప్యూటీ సీఎం అప్పట్లో బహిరంగంగానే విమర్శించారు.
రెండు నెలల పాటు అంతర్గత విచారణ జరిపిన పోలీసులు పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేసిన వెంటనే బదిలీ జరగకపోవడానికి తెర వెనుక రాజకీయ సమీకరణాలు ఉన్నట్లు తెలుస్తోంది. డీఎస్పీ జయసూర్యకు టీడీపీకి చెందిన ఒక కీలక నాయకుడు, ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు మద్దతుగా నిలిచారు. డీఎస్పీకి మంచి ట్రాక్ రికార్డు ఉందని, జూద శిబిరాలపై ఆయన కఠినంగా ఉండటం వల్లే కొందరు కావాలని ఆరోపణలు చేస్తున్నారని రఘురామ అప్పట్లో వ్యాఖ్యానించారు. కూటమిలోని ఇద్దరు ముఖ్య నేతల మధ్య భిన్నాభిప్రాయాలు రావడంతో ప్రభుత్వం ఈ విషయంలో ఆచితూచి అడుగువేసింది. విచారణ నివేదిక వచ్చే వరకు వేచి చూడటం వల్ల బదిలీ ప్రక్రియ ఆలస్యమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సంక్రాంతి సీజన్ వస్తూండగా హఠాత్తుగా మార్చేయడంపై జోరుగా చర్చలు ప్రస్తుతానికి జయసూర్యను భీమవరం నుంచి బదిలీ చేసిన ప్రభుత్వం, ఆయనకు ఎక్కడా స్పష్టమైన పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఆయనపై వచ్చిన ఆరోపణలపై శాఖాపరమైన విచారణ ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. సంక్రాంతి పండుగ వేళ గోదావరి జిల్లాల్లో జూద శిబిరాలు, కోడిపందాలు జోరుగా సాగే అవకాశం ఉన్నందున, పవన్ కళ్యాణ్ పట్టుబట్టి మరీ ఈ బదిలీ చేయించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.