Ramachandra Yadav meets Amit Shah in Delhi | న్యూఢిల్లీ: దేశంలో మరో భారతరత్న డిమాండ్ తెరపైకి వచ్చింది. దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళల అభ్యున్నతికి కృషి చేసిన సావిత్రి భాయి పూలేకు ప్రతిష్టత్మాకమైన భారతరత్న అవార్డు (Bharat Ratna) ఇవ్వాలని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కోరారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని, గత ప్రభుత్వ అవినీతి కుంభకోణాలు, అక్రమ కేసుల వ్యవహారాన్ని వెలికి తీయాలని ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరారు. ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో ఆదివారం సాయంత్రం ఆయన కలిశారు.. దాదాపు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ అంశాలు, గత ప్రభుత్వ నిర్వాకాలు, ప్రస్తుత సమస్యలు.. ఇలా అనేక అంశాలపై చర్చించారు..
సావిత్రీభాయి పూలేకు ఆ అవార్డు!!అమిత్ షాను కలిసిన వెంటనే ముందుగా ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంపై శుభాకాంక్షలు తెలిపారు. “సావిత్రీభాయి పూలేకు భారతరత్న అవార్డు ఇవ్వాలని వినతి పత్రం అందించి, ఆ అవసరాన్ని, ఆవశ్యకతను అమిత్ షాకు వివరించారు. జనవరి 3 వ తేదీన జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని.. బీసీవై పార్టీ (BCY Party) ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన వేడుకలు.. ఆ వేదికపై ఆర్సీవై మాట్లాడిన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ వినతి పత్రం అందించారు.
అనంతరం ఏపీకి సంబంధించిన అంశాలపై రామచంద్ర యాదవ్ మాట్లాడారు. ఏపీలో పరిపాలన, ప్రగతి, ప్రధాన సమస్యలు సహా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక వర్గాలపై పెట్టిన అక్రమ కేసులను ఓ సారి విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం విరివిగా నిధులిచ్చి సహకరించాలని కోరారు. ఏపీలో ఇటీవల రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్న తరుణంలో బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ అమిత్ షాను కలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.