Bandi Sanjay :  ఆంధ్రప్రదేశ్ బీజేపీకి సేవలు అందించేందుకు  తెలంగాణ సీనియర్ నేత బండి సంజయ్ సిద్ధమయ్యారు.  జగన్ ప్రభుత్వంపై అమీతుమీకి బీజేపీ సిద్ధమైంది. ఈ నెల 21న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో బండి సంజయ్ అమరావతికి రానున్నారు. ఆయన సేవలను ఏపీలో మరింత వాడుకోవాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. ఏపీలో ఓటరు నమోదు  ప్రక్రియను బండి సంజయ్ సమీక్షించనున్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి హోదాలో బండి సంజయ్‌కు  తెలంగాణ  తోపాటు ఏపీ  , మహారాష్ట్ర  , గోవా  , ఒడిషా   ఐదు రాష్ట్రాల పార్టీ తరపున ఓటర్ల జాబితా పరిశీలన బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.                             


బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన బండి సంజయ్          


బండి సంజయ్‌ను తెలంగాణ అధ్యక్షుడిగా మార్చిన తర్వాత బీజేపీ అధిష్టానం ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించింది.  ఏపీ ఇంఛార్జిగా ఉన్న సునీల్‌ దేవ్‌ధర్‌ను జాతీయ కార్యవర్గం నుంచి తొలగించారు. దీంతో ఆయనకు ఏపీ వ్యవహారాల కో ఇంచార్జ్ పదవి కూడా పోయినట్లయింది.  ఇదే సమయంలో కేరళకు చెందిన కేంద్ర మంత్రి మురళీధరన్ 2018 నుంచి ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఉంటూనే ఇన్‌ఛార్జ్‌గా చురుగ్గానే వ్యవహరించేవారు. కొంత కాలంగా మూడు నెలలకొకసారి కూడా ఏపీకి రావడంలేదు. 


ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ గా బాధ్యతలిస్తారని ప్రచారం                 


 ఏడాదిన్నరగా ఏపీ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతల నుంచి తప్పించమని పార్టీ హైకమాండ్‌ను మురళీధరన్ కోరుతున్నారని సమాచారం. బీజేపీలో గత ఎన్నికల తరువాత చేరిన కొందరి నేతల తీరు..రాష్ట్ర పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఆయన తప్పుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రాల్లో ఇన్‌ఛార్జ్‌లను సహ ఇన్‌ఛార్జ్‌లని మార్చడానికి బీజేపీ అధిష్టానం‌ కసరత్తులు చేస్తోంది.  . అందులో భాగంగా బండి సంజయ్ ను నియమించే అవకాశాలు ఉన్నట్లు బీజేపీ ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు.


తెలంగాణ బీజేపీకి మైలేజీ పెంచినట్లుగా పెంచుతారని బీజేపీ నేతల ఆశాభావం                             


తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ దూకుడుతో పార్టీకి మైలేజ్ వచ్చింది. ఏపీ బీజేపీలోనూ సంజయ్ కు ఆదరణ ఉంది. ఇదే సమయంలో పొత్తు రాజకీయం.. ఎన్నికల సమయం కావటంతో ఏపీ బాధ్యతలు అప్పగించటం ద్వారా అటు తెలంగాణ.. ఇటు ఏపీలోనూ బండి సంజయ్ నియామకం పార్టీకి మేలు చేస్తుందని బీజేపీ హైకమాండ్ లెక్కలు వేసుకుంటున్నట్లుగా  చెబుతున్నారు. ముందుగా ఆయన ఓటర్ల జాబితా అంశం పరిశీలనకు ఏపీకి వస్తూండటంతో.. తర్వాత పరిస్థితిని బట్టి ఇంచార్జ్ గా ప్రకటిచే అవకాశం ఉంది.