Balashauri  as Machilipatnam MP candidate  :  మచిలీపట్నం లోక్ సభ అభ్యర్థిని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన పార్టీ తరపున వల్లభనేని బాలశౌరి పేరును ఖరారు చేశారు. బాలశౌరి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఇటీవల ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు. జగన్ కు అత్యంత సన్నిహితుడు అయిన బాలశౌరి వైసీపీకి గుడ్ బై చెప్పడం ఆశ్చర్యకరంగా మారింది. జనసేన నుంచి ఆయనే పోటీ చేస్తారని పార్టీలో చేరినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే అధికారికంగా ప్రకటించలేదు. ఈ క్రమంలో ఆయనను అవనిగడ్డ అసెంబ్లీ నుంచి పోటీ చేయించి.. వేరే అభ్యర్థికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచన చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ.. చివరికి బాలశౌరి పేరే ఖరారు చేశారు.                  


టీడీపీ, బీజేపీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 2 లోక్ సభ స్థానాలు, 21 శాసనసభ స్థానాల్లో పోటీ చేస్తోంది. అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. విశాఖ సౌత్ అభ్యర్థిగా వంశీకృష్ణ యాదవ్ పేరు దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తోంది. అవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ స్థానాల్లో ఆశావహులు ఎక్కువగా ఉండటంతో... ఆయా స్థానాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. సరైన అభ్యర్థుల కోసం సర్వే జరుగుతోందని జనసేన తెలిపింది. సర్వేల్లో సంతృప్తికర ఫలితాలు వచ్చిన తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించింది.                    


విశాఖ దక్షిణ నియోజకవర్గం సీటు రసకందాయంలో పడింది. ఈ టికెట్‌ నాదంటే నాదని ఇద్దరు నాయకుల మధ్య వార్‌ జరుగుతోంది. సీటును తనకే ఖరారు చేశారంటూ వంశీకృష్ణ స్వయంగా ప్రకటించుకుని ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు.అవనిగడ్డ సీటు కోసం విక్కుర్తి శ్రీనివాస్‌, బండి రామకృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణ పోటీ పడుతున్నారు. వీరిలో ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో విక్కుర్తికే మొగ్గు ఉన్నట్లు తేలింది. కానీ టీడీపీ నుంచి మండలి బుద్ద ప్రసాద్ ను చేర్చుకుని ఆయనకు టిక్కెట్ ఇవ్వాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. పాలకొండకు ఆరుగురు పోటీ పడుతున్నారు. ఇక్కడ వైసీపీ నుంచి విశ్వాసరాయి కళావతి పోటీ చేస్తున్నారు. జనసేన తరఫునా మహిళనే బరిలోకి దించే ఆలోచనలో జనసేన నాయకత్వం ఉంది. 


మరో వైపు ఈ రోజు నుంచి పవన్ కల్యాణ్..  ప్రచారం ప్రారంభించారు. పిఠాపురం నుంచి ఆయన ప్రచార భేరి ముగించారు. మూడు రోజుల పాటు పిఠాపురంలోనే ప్రచారం నిర్వహిస్తారు.