TDP 41st Anniversary : నందమూరి తారకరామారావు అనే పేరు సంక్షేమానికి చిరునామా అని హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ అన్నారు. నిరంతరం పేదల అభ్యున్నతి కోసం పరితపించిన ఎన్టీఆర్ తాను ప్రవేశపెట్టిన పథకాలతో ప్రజల గుండెల్లో ఎప్పటికీ జీవించి ఉంటారని పేర్కొన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టిన ఎన్టీఆర్ పాలనలో ఎన్నో సాహసోపేతమైన పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు.
ఎన్టీఆర్‌కు ముందు ఎందరో రాజకీయాల్లో ఉన్నా ఆయనలా ప్రజల కోసం ఆలోచించిన వారు లేరని బాలకృష్ణ తెలిపారు. రాజకీయాలు ఎన్టీఆర్‌కు ముందు ఎన్టీఆర్ తర్వాత అని చెప్పుకోవాలని.. ఆయన టీడీపీ స్థాపనతో రాజకీయాల్లో విప్లవం తెచ్చారని చెప్పారు. అప్పటివరకూ రాజకీయాలంటే ధనవంతులకే సొంతమని.. ఎన్టీఆర్ రాకతో బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారెందరో రాజకీయాల్లోకి వచ్చి నాయకులుగా మారారని బాలకృష్ణ గుర్తుచేశారు. పార్టీతో, పాలనతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. ఎన్టీఆర్ పాలనలో ఎన్నో సాహసోపేతమైన పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. పేదల ఆకలి తెలిసిన అన్నగా, ప్రతి తెలుగు బిడ్డ సగర్వంగా తలఎత్తుకునేలా చేశారని ప్రశంసించారు. ప్రజల భవితకు భరోసా ఇవ్వడమే కాకుండా నవజాతికి మార్గదర్శనం చేశారని. యువతకు ఆదర్శంగా నిలిచారని ఎన్టీఆర్‌కు మరణం లేదు.. నిత్యం వెలిగే మహోన్నత దీపమని బాలకృష్ణ స్పష్టంచేశారు.
ఎన్టీఆర్ తర్వాత ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయని బాలకృష్ణ తెలిపారు. వాటిని నిలిపివేసేందుకు ఎవరూ సాహసించలేనంతగా ఆనాడే పథకాలకు పునాది వేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఆయన చలవేనని చెప్పారు. ఇళ్లు లేని పేదలకు పక్కా ఇళ్ల పథకం తీసుకువచ్చారని.. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసి సామాజిక సంస్కరణలు తెచ్చారని గుర్తుచేశారు. ప్రజల వద్దకే పరిపాలనను తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మహిళలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. సహకార వ్యవస్థలో సింగల్ విండో విధానం తెచ్చిన నేత ఎన్టీఆర్ అని అన్నారు. గురుకుల విద్యా బోధన, సంక్షేమ హాస్టళ్లు తీసుకువచ్చారని ఆనాటి విషయాలను ప్రజలతో పంచుకున్నారు. అలాంటి గొప్ప వ్యక్తికి గుర్తుగా పెట్టిన ఎన్టీఆర్ వర్సిటీ పేరును వైకాపా ప్రభుత్వం మార్చడం దౌర్భాగ్యమని మండిపడ్డారు.
ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు యువతకు పెద్దపీట వేశారని, జీనోమ్ వ్యాలీ, బయోటెక్నాలజీ పార్కు తీసుకువచ్చారని బాలకృష్ణ తెలిపారు. ఆయన హయాంలో నల్సార్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందిందని, నగరం 28 ఫ్లైఓవర్లు నిర్మించి ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఎంఎంటీస్ ద్వారా లక్షలాది మందికి ప్రయాణ సౌకర్యం కల్పించారని, రైతులకు పెద్దఎత్తున వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి ఘన విజయం అందించారని.. రాబోయే ఎన్నికల్లోనూ ఇదే ఒరవడి కొనసాగిస్తామని ప్రజలు తమ భవిష్యత్తు కోసం ప్రతిజ్ఞ పూనాలని బాలకృష్ణ కోరారు.