Telugu News: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు చెందిన ఓ యువకుడికి మంత్రి నారా లోకేశ్ ఆర్థికంగా సాయం చేస్తానని మాటిచ్చిన సంగతి తెలిసిందే. తనకు చదువుకు అయ్యే రూ.4 లక్షల సాయం చేస్తానని నారా లోకేశ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. నిన్న (ఆగస్టు 5) ఈ పరిణామం జరగ్గా.. నేడు స్పీకర్ అయ్యన్నపాత్రుడు సోషల్ మీడియాలో స్పందించారు. ‘‘తన ప్రతిభతో ఐఐఐటీ లక్నోలో సీటు తెచ్చుకుని రూ.4 లక్షల ఫీజు కట్టుకోలేని స్థితిలో ఉన్న తణుకు నియోజకవర్గం అత్తిలి గ్రామానికి చెందిన బసవయ్య అనే విద్యార్థి విషయంలో మంత్రి నారా లోకేష్ స్పందించి సాయం అందించిన తీరు స్ఫూర్తిదాయకం. నారా లోకేశ్ కి ఒక్క ట్వీట్ పెట్టడంతో తన కల సాకారం అవుతుందని ఆ విద్యార్థి ఊహించి ఉండడు. ఆల్ ది బెస్ట్ బసవయ్య’’ అని అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు. 






సాయం కోసం యువకుడు ట్వీట్
‘‘నా పేరు బసవయ్య. మాది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలోని అత్తిలి గ్రామం. నాకు ఐఐటీ జామ్‌ - 2024లో 930వ ర్యాంకు వచ్చింది. దాంతో నాకు ట్రిపుల్ ఐటీ లక్నోలో (ఎంఎస్సీ డేటా సైన్స్) సీటుకు కూడా వచ్చింది. ఈ కోర్సు ఫీజు దాదాపు 4 లక్షలు ఉంటుంది. మా ఫ్యామిలీ ఆర్థికంగా చాలా వీక్. నాకు హెల్ప్ చేయండి’’ అని చేబ్రోలు కాశీ నాగ బసవయ్య అనే యువకుడు ట్విటర్‌ ద్వారా మంత్రి లోకేశ్‌ను కోరారు. 


దీనికి మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘‘నువ్వు ట్రిపుల్ ఐటీ లక్నోలో చదువుతావు. నువ్వు నీ కల నెరవేర్చుకుంటావు. ఫీ విషయం నేను చూసుకుంటాను. ఆల్ ది బెస్ట్ బసవయ్య’’ అని నారా లోకేశ్ స్పందించారు.






తాజాగా అయ్యన్నపాత్రుడు కూడా స్పందించడంతో బసవయ్య కూడా స్పందించాడు. ‘‘ఒక విద్యాశాఖ మంత్రి తన రాష్ట్ర విద్యార్థులు  కోసం ఇంత శ్రద్ధ  తీసుకోవడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే నాకు తెలిసి ఇదే తొలిసారి అవ్వచ్చు. ఈ కీర్తి అంతా నారా లోకేశ్ అన్నకు చెందుతుంది. లోకేష్ అన్న మాకు విద్యాశాఖ మంత్రిగా ఉండడం మేము చేసుకున్న అదృష్టం’’ అని బసవయ్య మరో ట్వీట్ చేశాడు.