Mandali Buddhaprasad joined Janasena : ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయనతో పాటు అనుచరులు కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. బుద్ధప్రసాద్‌కు ఇప్పటికే అవనిగడ్డ టికెట్ ఖాయమైనట్టు చెబుతున్నారు. పొత్తులో భాగంగా అవనిగడ్డ స్థానం జనసేనకు కేటాయించారు. అక్కడ టీడీపీకి బలమైన అభ్యర్థిగా బుద్దప్రసాద్ ఉన్నారు. ఈ కారణంగా ఆయన అసంతృప్తికి గురయ్యారు. 1999, 2004, 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన ఆయనకు నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. ఆయనకు టికెట్ ఇవ్వడం ద్వారా అవనిగడ్డను తన ఖాతాలో వేసుకోవాలని జనసేన భావిస్తోంది.
అవనిగడ్డ సీటును పొత్తుల్లో భాగంగా జనసేనకి కేటాయించగా, ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్, జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, మచిలీపట్నం ఆర్‌కే మెస్ అధినేత బండి రామకృష్ణ, న్యాయవాది మత్తి వెంకటేశ్వరరావు, సీనియర్ రాజకీయవేత్త బచ్చు వెంకటనాథ్ తదితరులు ప్రయత్నాలు చేశారు. కొద్దిరోజుల క్రితం జనసేన ఐవీఆర్‌ఎస్ సర్వే నిర్వహించగా, అందులో విక్కుర్తి శ్రీనివాస్, బండి రామకృష్ణ, బండ్రెడ్డి రామకృష్ణల పేర్లకు ఎక్కువ ఆమోదం లభించింది. వారిలో ఎవరో ఒకరికి జనసేన పార్టీ అభ్యర్థిత్వం ఖరారు అవుతుందని ఆ పార్టీ శ్రేణులు భావించాయి. అనూహ్యంగా శనివారం నుంచి బుద్ధప్రసాద్ పేరు తెరపైకి రావటంతో జనసేన కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. గతంలో వైసీపీ నుంచి కూడా బుద్ద ప్రసాద్‌కు ఆఫర్ వచ్చింది. రెండు పార్టీల ముఖ్య నేతలు జనసేన పార్టీలో చేరమని విజ్ఞప్తి చేసినందున .. ఆ దిశగానే మండలి బుద్ద ప్రసాద్ మొగ్గు చూపారు.
అవనిగడ్డలో జరుగుతున్న కీలక పరిణామాల నేపథ్యంలో ఆరు మండలాల జనసేన నేతలు, క్యాడర్ సమావేశమయ్యారు. టికెట్ టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్‌కి ఇస్తున్నారన్న ప్రచారంపై సమావేశం నిర్వహించారు. ఈ సీటు జనసేనకు ఇస్తే గెలవదు అని రాజీనామాలు చేసిన టీడీపీ నేతల వ్యాఖ్యలపై జన సేన నేతలు ఫైర్ అయ్యారు. టికెట్ బుద్ధ ప్రసాద్ కు ఇచ్చిన తర్వాత ఏం చేయాలనే దానిపై చర్చించారు. అవనిగడ్డ సీటు జనసేన పార్టీ వారికే ఇచ్చేలా పోరాటం చేద్దామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ జనసేన నేతలు, కేడర్‌కు సూచించారు. అయితే పవన్...బుద్దప్రసాద్‌ను చేర్చుకున్నారు. ఆయనకే టిక్కెట్ ప్రకటిస్తే.. వీరు ఏం చేస్తారో చూడాల్సి ఉంది.
అవనిగడ్డ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఎక్కవగా ఉంటుంది. ముందు నుంచి జనసేన పార్టీకి మంచి ఆదరణ ఉంది. గత ఎన్నికల్లో దాదాపుగా ముప్పై వేల ఓట్ల వరకూ వచ్చాయి. కూటమిలో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఏకపక్ష విజయం వస్తుందన్న నమ్మకంతో.. ఉన్నారు.