Julakanti Brahmananda Reddy: పల్నాడు జిల్లా మాచర్ల టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.  వెల్దుర్తి మండలం గొట్టిపాళ్లలో  ఆగస్టు 30న వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ రిమాండ్‌ రిపోర్టులో జూలకంటి పేరును ఏ-12గా చేర్చారు. ఇటీవల ఈ కేసులో ఏ10గా ఉన్న మధు యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.జూలకంటి చెప్పడం వల్లే  హత్యాయత్నం చేసినట్లు మధు  విచారణలో చెప్పినట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. దీంతో జూలకంటి పేరును ఏ-12గా చేర్చారు.


ఈ ఘటనలో ఇదివరకే టీడీపీ కార్యకర్తలపై 307తోపాటు మరికొన్ని సెక్షన్లతో కేసు నమోదు చేశారు. మరో ఐదుగురు టీడీపీ కార్యకర్తల పేర్లను సైతం నిందితులుగా రిమాండ్ రిపోర్టులో చేర్చినట్లు తెలుస్తోంది. దీనిపై టీడీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధును అదుపులోకి తీసుకున్నా రిమాండ్‌కు పెట్టకుండా ఎమ్యెల్యే పిన్నెల్లి ప్రోద్బలంతో జూలకంటి బ్రహ్మానంద రెడ్డిపై  అక్రమ కేసు బనాయించారని ఆరోపించారు.


ఇదీ వివాదం
వెల్దుర్తి మండలం గొట్టిపాళ్ల గ్రామంలో సత్తెమ్మ కొలుపులు జరుగుతుండగా టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది.  అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే క్రమంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. కర్రలు, మారణాయుధాలతో టీడీపీ, వైసీపీ మద్దతుదారులు పరస్పర దాడులకు దిగారు. దాడుల్లో టీడీపీ, వైసీపీ వర్గీయులు గాయపడ్డారు. భయాందోళనకు గురైన ప్రజలు ఇంట్లో నుంచి ప్రాణభయంతో పరుగులు తీశారు. దాదాపు రెండు గంటల పాటు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. 


మారుమూల అటవీ ప్రాంతం కావడం, మండల కేంద్రానికి సుమారు 40 కిలోమీటర్ల దూరం ఉండటం వల్ల ఈ ఘటన గురించి పోలీసులు రావడంలో ఆలస్యమైంది. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు, దాడుల గురించి పోలీసులకు సమాచారం ఇచ్చినా.. ఎవరూ గ్రామానికి రాలేదని టీడీపీ, వైసీపీ వర్గాల నేతలు ఆరోపించారు. పోలీసులు వెంటనే వచ్చి ఉంటే దాడుల తీవ్రత ఈ స్థాయిలో ఉండేది కాదని ప్రజలు వాపోయారు. దాడుల్లో గాయపడిన వైసీపీ , టీడీపీ వర్గీయులకు తొలుత మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన సేవల కోసం క్షతగ్రాతుల్ని నర్సరావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.