APSRTC: అసెంబ్లీ ఎన్నికలపై టీడీపీ-జనసేన కూటమి స్పీడ్ పెంచింది. ఎన్నికల ప్రచారాన్ని మరింత హోరెత్తించేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే రా.. కదలి.. రా పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తుండగా.. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం పేరుతో సభలు నిర్వహిస్తున్నారు. ఇక చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభలకు టీడీపీతో పాటు జనసేన నేతల, కార్యకర్తలు కూడా హాజరవుతున్నారు. ఇక టీడీపీ-జనసేన కలిసి ఉమ్మడి బహిరంగ సభలు కూడా నిర్వహిస్తున్నాయి.
ఈ నెల 17న చిలకలూరిపేటలో సభ
ఇటీవల తాడేపల్లిగూడెంలో జెండా పేరుతో టీడీపీ-జనసేన కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించాయి. ఈ సభలో చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. అలాగే మంగళగిరిలో ఇటీవల జయహో బీసీ పేరుతో బహిరంగ సభ నిర్వహించగా.. ఈ సభలో చంద్రబాబు, పవన్ కలిసి బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. అయితే చంద్రబాబు, పవన్ కలిసి మరిన్ని బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 17వ తేదీన చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. అలాగే పలు కీలక ప్రకటనలు కూడా చేయనున్నారు .దీంతో ఈ సభకు భారీగా జనసమీకరణ చేయాలని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి.
అద్దె బస్సులు ఇవ్వండి
ఈ క్రమంలో సభలకు జనాలను తరలించేందుకు అద్దె బస్సులు ఇవ్వాల్సిందిగా ఏపీఎస్‌ఆర్టీసీకి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇవాళ లేఖ రాశారు. చిలకలూరిపేటలో తలపెట్టిన టీడీపీ, జనసేన ఉమ్మడి సభకు బస్సులు ఇవ్వాలని ఆర్టీసీ ఎండీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అధికార వైసీపీ సభలకే ఆర్టీసీ బస్సులను ఇస్తున్నారని, ప్రతిపక్షాల సభలకు ఎందుకు ఇవ్వడం లేదని ఇందులో ప్రశ్నించారు. ప్రతిపక్షాల పట్ల విపక్షపూరితంగా వ్యవహరిస్తే న్యాయపోరాటానికి సిద్దమని హెచ్చరించారు. ఈ సభకు లక్షలాదిగా స్వచ్చంధంగా ప్రజలు తరలివస్తారని, వాళ్లు తిరిగి ఇంటికి వెళ్లాలంటే రవాణా సౌకర్యం అత్యవసరమని అన్నారు. గతంలో అనేకసార్లు టీడీపీ సభలకు అద్దె బస్సులు కావాలని కోరినా ఇవ్వలేదని, వైసీపీ సభల కోసం మాత్రం కేటాయించారని తెలిపారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో తగదన్నారు. బస్సులు అద్దెకు ఇవ్వకపోతే ఎన్నికల సంఘాన్ని లేఖ రాస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు.
ఆర్డీసీ ఎండీ తగిన మూల్యం చెల్లించుకుంటారు
తమ సభలకు బస్సులు కేటాయించకపోతే ఆర్టీసీ ఎండీ భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని అచ్చెన్నాయుడు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో తప్పు చేసిన ఇతర అధికారుల మాదిరిగానే ఆయన మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. అందరినీ సమానంగా చూడాలని తాము కోరుతున్నామన్నారు. బస్సులు ఇవ్వకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. కాగా గురువారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి నాదెండ్ల మనోహర్ వచ్చారు. టీడీపీ, జనసేన ఉమ్మడి సభ నిర్వహణపై అచ్చెన్నాయుడితో చర్చించారు. అనంతరం ఇరువురు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.