Gautam Sawang resigns as APPSC Chairman | అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక భారీగా బదిలీలు, మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ముఖ్యమంగా వైసీపీ ప్రభుత్వంలో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన వారు ఒక్కొక్కరు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. తాజాగా ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ రాజీనామా చేశారు. సవాంగ్ రాజీనామాను చంద్రబాబు ప్రభుత్వం ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవికి గౌతమ్ సవాంగ్ రాజీనామా చేయగా, గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అమరావతి పర్యటనకు వెళ్లగా కొందరు దుండుగులు ఆయనపై రాళ్లు రువ్వారు. దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్.. ప్రజాస్వామ్యంలో నిరసన ప్రక్రియలో ఇది ఓ భాగమన్నారు. నిరసన తెలిపేందుకే కొందరు చంద్రబాబుపై రాళ్లు రువ్వారని సవాంగ్ చేసిన కామెంట్లు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి.


అప్పటి వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా ఉండేందుకు డీజీపీగా ఉన్న సవాంగ్ అలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని టీడీపీ అప్పట్లోనే విమర్శించింది. ఆపై డీజీపీ సవాంగ్ ను ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా నియమించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగా, జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ల జాబ్స్ ఖాళీలు భర్తీ చేయాల్సి ఉన్న సమయంలో సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు.