APPSC Digital Valuation Scam Truegrader Services:   వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో జరిగిన భారీ అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉక్కుపాదం మోపింది. అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం కింద నమోదైన కేసులో భాగంగా ఈడీ హైదరాబాద్ జోనల్ బృందాలు బుధవారం తెల్లవారుజాము నుంచే తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్‌లతో పాటు ఏపీలోని గుంటూరు జిల్లా పరిధిలోని 7 కీలక ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. నాటి ఏపీపీఎస్సీ కార్యదర్శి, సీనియర్ ఐపీఎస్ అధికారి పి. సీతారామాంజనేయులు ఇల్లు, కార్యాలయాలతో పాటు కాంట్రాక్టులు దక్కించుకున్న ప్రైవేట్ సంస్థల అధినేతల నివాసాల్లో ఈ సోదాలు కొనసాగాయి.

Continues below advertisement

విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఐపీసీ 420, 120-బి ఎఫ్‌ఐఆర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఈడీ, షాకింగ్ విషయాలను బయటపెట్టింది. గతంలో నిబంధనలకు విరుద్ధంగా జరిపిన డిజిటల్ మూల్యాంకనాన్ని ఏపీ హైకోర్టు రద్దు చేసి పారదర్శకంగా మ్యానువల్ పద్ధతిలోనే జవాబు పత్రాలు దిద్దాలని ఆదేశించింది. అయితే, ఆ సమయంలో కమిషన్‌కు రెగ్యులర్ ఛైర్మన్ లేని కాలాన్ని ఆసరాగా చేసుకున్న నాటి సెక్రటరీ పి. సీతారామాంజనేయులు హైకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కారు. అధికారిక సమాచారాన్ని, జవాబు పత్రాలను సీక్రెట్‌గా గుంటూరు జిల్లా చినకాకానిలోని  హాయ్‌ల్యాండ్  ప్రైవేట్ రిసార్ట్‌కు తరలించి,  క్యామ్‌సైన్ మీడియా అనే ఏజెన్సీకి అప్పగించి 84 రోజుల పాటు అక్కడే ఉంచినట్లు దర్యాప్తులో తేలింది.

ఈ హాయ్‌ల్యాండ్ రిసార్ట్ మూల్యాంకనం వెనుక పెద్ద నాటకమే నడిచిందని ఈడీ తేల్చిచెప్పింది. అసలు అక్కడ ఎలాంటి మ్యానువల్ వ్యాల్యుయేషన్ జరగలేదని, గతంలో కోర్టు రద్దు చేసిన డిజిటల్ వ్యాల్యుయేషన్ మార్కులనే మ్యానువల్ మార్కులుగా మళ్లీ రికార్డుల్లో ఎక్కించి అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడారని పేర్కొంది. అసలు పనే చేయని  క్యామ్‌సైన్ మీడియా సంస్థకు నాటి సెక్రటరీ సీతారామాంజనేయులు స్వయంగా సంతకం చేసిన చెక్కు ద్వారా రూ. 1,14,32,312 పబ్లిక్ ఫండ్స్ చెల్లించారని, పీఎమ్‌ఎల్‌ఏ చట్టం సెక్షన్ 2(1)(u) ప్రకారం ఇది నిరూపితమైన  నేరపూరిత ఆదాయం కిందకు వస్తుందని అధికారులు స్పష్టం చేశారు. తదనంతరం వచ్చిన నూతన ఛైర్మన్ ఈ వ్యాల్యుయేషన్‌ను రద్దు చేసి, పేపర్లను వెనక్కి రప్పించి సీసీ కెమెరాల నిఘాలో మళ్లీ మూల్యాంకనం చేయించారు.  

Continues below advertisement

ఈ సంచలన తనిఖీలలో ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులుతో పాటు క్యామ్‌సైన్ మీడియా ఎండీ పి. మధుసూదనరావు, హాయ్‌ల్యాండ్ రిసార్ట్స్ యాజమాన్యం, తొలి డిజిటల్ వ్యాల్యుయేషన్ చేసిన ట్రూగ్రేడర్ సర్వీసెస్ ఎండీ అకెళ్ల పేరి నివాసరావు, మహంకాళి రఘురామ్‌ల ఇళ్ల నుంచి భారీగా ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిజిటల్ పరికరాలు, హార్డ్ డిస్క్‌లు, క్రాస్-లావాదేవీల చిట్టాలతో పాటు అనుమానాస్పద ఆస్తుల రికార్డులను సీజ్ చేసినట్లు ఈడీ అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం ఐపీఎస్ సీతారామాంజనేయులు సహా ప్రధాన నిందితుల వాంగ్మూలాలను ఈడీ రికార్డు చేసింది. పబ్లిక్ ఫండ్స్ దుర్వినియోగం వెనుక ఉన్న పొలిటికల్ మాస్టర్‌మైండ్స్  పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ తెలిపింది.