Amaravati Case : అమరావతి రైతులు పాదయాత్ర ప్రారంభించిన సమయంలో మరోసారి అసైన్డ్ ల్యాండ్ కేసులు వెలుగులోకి వచ్చాయి.  రాజధాని అసైన్డ్‌ భూముల కొనుగోలు, అమ్మకాల్లో అవకతవకలుజరిగాయంటూ ఐదుగుర్ని సీఐడీ అరెస్ట్ చేసింది.  కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయలు, కొట్టి దొరబాబు అరెస్టు చేసినట్లుగా సీఐడీ ప్రకటించారు. మొత్తం 1100 ఎకరాల అసైన్డ్‌భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని సీఐడీ అధికారులు చెబుతున్నారు.  ఇందులో 169.27 ఎకరాలకు సంబంధించి విచారణకు సంబంధించి ఐదుగుర్ని అరెస్ట్ చేశామని ప్రకటించారు .


మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఫిర్యాదుపై అట్రాసిటీ కేసులు నమోదు చేసిన సీఐడీ 


రాజధాని అసైన్డ్‌భూముల వ్యవహారంలో వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి   ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు చంద్రబాఋ, నారాయణలపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతోపాటు ఏపీ అసైన్డ్‌ భూముల చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.   ద‌ర్యాప్తున‌కు రావాలంటూ నోటీసులు అంద‌జేశారు. దీనిపై కోర్టు స్టే ఇచ్చింది.  ఎస్సీ, ఎస్టీ చ‌ట్టం కింద కేసు న‌మోదు చేయాలంటే ద‌ళితులే ఫిర్యాదు చేయాలి. కానీ థ‌ర్డ్ పార్టీ కింద కేసు న‌మోదు చేశారు. అప్పుడే ఈ అంశంపై దుమారం రేగింది. అదే సమయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పినట్లుగా బాధితులెవరూ ముందుకు రాలేదు. తమ భూములు అన్యాయం తీసుకున్నారని ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వారు కూడా తాము ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని స్పష్టం చేశారు. వారి వీడియోలను టీడీపీ అప్పట్లోనే విడుదల చేసింది. 


నారాయణ బినామీలు కొనుగోలు చేసినట్లుగా ఆధారాలు లభించాయన్న సీఐడీ 


అయితే సీఐడీ సుదీర్ఘంగా విచారణ జరిపి  మాజీ మంత్రి నారాయణ సొంత బంధువులు, పరిచయస్తుల పేరుతో బినామీ లావాదేవీలు జరిపినట్టుగా నిర్ధారించామని అందుకే అరెస్టులు చేశామని చెబుతోంది. అనంతవరం, కృష్ణాయపాలెం, కూరగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంటకపాలెం గ్రామాల్లో వేర్వేరు సర్వే నంబర్లలో సుమారు 89.8 ఎకరాల భూమిని మాజీ మంత్రి నారాయణ తన బంధువులు, పరిచయస్తుల పేరుతో అక్రమంగా కొనుగోలు చేశారని సీఐడీ ఆరోపిస్తోంది.  రామకృష్ణా హౌసింగ్‌ డైరెక్టర్‌ ఖాతాలద్వారా పేమెంట్లు చేసి ఈ వ్యవహారాలు చేశారని సీఐడీ చెబుతోంది.  ఈ కేసులో ఇతర నిందితులు వారి తరఫు మనుషులు మరో 79.45 ఎకరాల అసైన్డ్‌ ల్యాండ్స్‌ను అక్రమంగా కొనుగోలు చేశారని చెబుతున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి నారాయణ – రామకృష్ణా హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మధ్య రూ.15 కోట్ల లావాదేవీలు జరిగాయని  సీఐడీ అధికారులు మీడియాకు వివరించారు. 


ఒక్క బాధితుడూ ఫిర్యాదు చేయని కేసు 


అయితే ఏ ఒక్క దళిత రైతు కూడా తమ వద్ద అక్రమంగా భూములు కొనుగోలు చేశారని ఫిర్యాదు చేయని ఈ కేసులో .. ఎమ్మెల్యే ఫిర్యాదు మీదనే సీఐడీ చర్యలు తీసుకోవడంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో చంద్రబాబు, నారాయణనూ నిందితులుగా పెట్టి ఉన్నారు కాబట్టి తదుపరి చర్యలు సీఐడీ ఏం తీసుకోబోతోందనన్న ఆసక్తి వ్యక్తమవుతోంది.