AP Students With PM Modi : ఏపీలోని ఎస్సీ హాస్టళ్లకు చెందిన విద్యార్థులకు తమ విజ్ఞాన యాత్రలో దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి అవకాశం వచ్చిందని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. ఈ సందర్భంగా  ప్రధాని మోదీ విద్యార్థులతో ముచ్చటించారని తెలిపారు. విద్యార్థులకు పుస్తకాలను బహూకరించారని వెల్లడించారు. ఇండియన్ బ్యాంక్ తన సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను విజ్ఞాన యాత్రకు తీసుకెళ్లిందని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. ఈ యాత్రలో వైఎస్సార్ కడప, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన ఎస్సీ హాస్టళ్లలోని ప్రతిభావంతులైన 42 మంది బాల, బాలికలు పాల్గొన్నారని చెప్పారు. ఈ నెల 14 నుంచి 19 దాకా కొనసాగిన ఈ యాత్రలో దిల్లీకి చేరుకున్న విద్యార్థులు అక్కడి పార్లమెంట్ భవనంలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారని తెలిపారు. ఈ సందర్భం విద్యార్థులతో ప్రధాని మోదీ కొద్ది సేపు వారితో ముచ్చటించారని, వారి ప్రయాణ వివరాలను అడిగి తెలుసుకున్నారని తెలిపారు. ముఖ్యంగా స్వాతంత్ర్య సమర యోధుల జీవిత చరిత్రలకు సంబంధించిన పుస్తకాలు, స్వామి వివేకానంద వంటి మహనీయుల జీవిత గాథలు చదివి వాటి ద్వారా స్ఫూర్తిని పొందాలని ప్రధాని మోదీ విద్యార్థులకు సూచించారన్నారు.


ఎగ్జామ్ వారియర్స్ పుస్తకాలు బహూకరించి ప్రధాని 


పరీక్షల విషయంలో ఎటువంటి భయాలు పెట్టుకోవద్దని, కష్టపడి కాకుండా ఇష్టపడి చదవి తమ భవిష్యత్తును ఉజ్వలంగా మలచుకోవాలని విద్యార్థులకు ప్రధాని మోదీ సూచించారని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. భావి భారత పౌరులుగా ఉన్నత స్థానాలకు ఎదగాలని విద్యార్థులకు మోదీ హితవు చెప్పారన్నారు. నైతిక విలువలు పాటిస్తూ నీతి నిజాయితీలతో సంపాదించాలని, సంపాదించిన ధనాన్ని వృధా చేయకుండా పొదుపు చేయాలని విద్యార్థులకు సూచించారని,  జన్ ధన్ ఖాతాలను ప్రారంభించి వాటి ద్వారా పొదుపును ప్రారంభించాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారని మంత్రి నాగార్జున వెల్లడించారు. తమ పరీక్షలలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ఎగ్జామ్ వారియర్స్ పుస్తకాలను కూడా ప్రధాని బహూకరించి వారితో ఫొటోలు దిగారని చెప్పారు. ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులు పార్లమెంట్ ను సందర్శించగా అక్కడి అధికారులు పార్లమెంటులో ఎవరు ఎక్కడ కూర్చుంటారనే వివరాలను విద్యార్థులకు తెలుపుతూ పార్లమెంట్ మొత్తాన్ని చూపించారని మంత్రి తెలిపారు. తమ విద్యార్థులు దేశ ప్రధానిని కలిసి మాట్లాడటం సంతోషంగా ఉందని మంత్రి నాగార్జున పేర్కొన్నారు.