AP Govt Employees Salaries : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి జీతాలు లేటయ్యాయి. పెన్షనర్లదీ అదే కథ. ఒకటో తారీఖున అందాల్సిన జీతాలు ఈ సారి 5వ తేదీ తర్వాతే అందవొచ్చు అంటున్నాయి అధికారవర్గాలు. దీనికి సాంకేతిక కారణాలను సమస్యగా చూపుతున్నాయి. అయితే ఉద్యోగ సంఘ వర్గాలు మాత్రం ఏపీ ఖజానాలో డబ్బు లేకపోవడం వల్లే అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. 


ఉగాది నాడూ జీతాలు రాలేదాయే:


సాధారణంగా ఏ నెల అయినా ఒకటి లేదా రెండో తారీఖుల్లో సెలవు లేదా పండుగ లాంటిది వస్తే అంతకు ఒకరోజు ముందే జీతాలు జమ చేస్తూ ఉంటుంది. అయితే ఏపీలో మాత్రం ఈ పద్ధతి వేరేగా ఉంటూ వస్తుంది. సంక్షేమ పథకాల అమలుకు తోడు అపుల భారంతో ఉన్న ఏపీలో రాబడికి పెడుతున్న ఖర్చుకు మధ్య పొంతన కుదరడం లేదని ఆర్ధిక నిపుణులు చెబుతూ వస్తున్నారు. గతంలో వరుసగా ప్రతీ నెలా జీతాలు లేటవ్వడంతో ఉద్యోగులు గగ్గోలు పెట్టారు. అయితే గత కొన్నినెలలుగా జీతాలు టైముకే ఇస్తూ వచ్చిన ప్రభుత్వం ఈ నెల మాత్రం మళ్లీ పాత పంథాకే వచ్చింది. ఈ నెల 5వ తారీఖు తర్వాతనే జీతాలు పెన్షన్లు పడే అవకాశం ఉందంటున్నాయి ట్రెజరీ వర్గాలు. దానితో ఈ ఏడాది తెలుగు సంవత్సరాది చేతిలో డబ్బు లేకుండానే వెళ్లిపోయింది అంటున్నాయి ఉద్యోగ వర్గాలు. 


సాంకేతికే సమస్యలే కారణం : ప్రభుత్వం 


అయితే జీతాలు ఆలస్యం అవ్వడానికి సాంకేతికంగా ఏర్పడ్డ సమస్యలే కారణం అంటున్నాయి అధికార వర్గాలు. ఎప్పుడూ జీతాలు ప్రాసెస్ చేసే SAP ప్లాట్ ఫామ్ ను మార్చి వేరే ప్రోగ్రామింగ్ ద్వారా బిల్లులు అప్లోడ్ చెయ్యడంతో అవి రిటర్న్ అయ్యాయని వారు చెప్పుకొస్తున్నారు. కొత్తగా రూపొందించిన సాఫ్ట్ వేర్ RBIకు అనుసంధానం కాకపోవడంతోనే జీతాలు, పెన్షన్లకు చెందిన బిల్లులు వెనక్కు వచ్చేశాయని ఆర్థికశాఖ వర్గాల కథనం. అందుకే మరోసారి బిల్లులన్నింటినీ సబ్మిట్ చెయ్యాలని ట్రెజరీని కోరడంతో ఆలస్యం అయిందనీ మరో ఒకటి రెండు రోజుల్లో జీతాలు ఉద్యోగుల ఖాతాల్లో జమ కావొచ్చని చెబుతున్నాయి అధికార వర్గాలు. దానికి తోడు ఉగాది, ఆదివారం అంటూ సెలవులు రావడాన్ని కూడా ఒక కారణంగా ప్రభుత్వం చూపుతోంది. 


ఆర్ధిక సంవత్సర ముగింపు కూడా కారణమే 


మార్చి నెల ముగింపు సందర్బంగా ప్రభుత్వంపై బిల్లుల చెల్లింపు కోసం ఒత్తిడి ఉంటుంది. ఖజానాలో ఉన్న కొన్ని నిధులనూ వాటికోసం చెల్లించారని తెలుస్తోంది. అదే విధంగా సర్పంచుల ఖాతాల్లోని పంచాయితీల నిధులూ వాడేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే RBI ఇచ్చే వేస్ అండ్ మీన్స్ వెసులుబాటు నిధులు రెండు వేల కోట్లనూ ప్రభుత్వం ఖర్చు పెట్టేసింది అంటున్నారు.  ఈ నేపథ్యంలో ప్రస్తుతం జీతాలు ఇవ్వాలంటే అప్పు కోసం వెళ్లాలి అంటున్నారు ఆర్థిక నిపుణులు. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది కాబట్టి కేంద్ర ఆర్ధిక శాఖ కొత్త అప్పులకు రాష్ట్రాలకు అనుమతి ఇస్తుంది. దానిని ఉపయోగించుకొని కొత్త అప్పుల కోసం ఏపీ రెడీ అవుతుందని అవి వస్తే జీతాలు చెల్లించాలని చూస్తుందని కథనాలు వస్తున్నాయి. లేదా బాండ్లను తాకట్టుపెట్టాలంటే మాత్రం మంగళవారం వరకూ ఆగాల్సి ఉంటుంది. అదే గనుక జరిగితే జీతాలు అందాలంటే 5వ తేదీ దాటిపోవాల్సి ఉంటుంది.