ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజుల పాటు విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (MD) ప్రఖర్ జైన్ తెలిపారు. ఒకవైపు మేఘావృతమైన వాతావరణంతో కొన్ని జిల్లాల్లో వర్షం సమయంలో పిడుగులు పడే అవకాశం ఉండగా, మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, రాయలసీమ నుండి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి ఉండటంతో ఈ మార్పులు చోటుచేసుకున్నాయని ఏపీఎస్డీఎంఏ వెల్లడించింది.

Continues below advertisement

పిడుగుల ముప్పు - రైతులు, పశువుల కాపరులకు హెచ్చరిక నేటి నుంచి రెండు రోజులు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో చెట్ల కింద నిలబడరాదని ప్రఖర్ జైన్ హెచ్చరించారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని, బహిరంగ ప్రదేశాల్లో ఉండటం ప్రమాదకరమని స్పష్టం చేశారు.

జిల్లాల వారీగా ఏపీలో వర్ష సూచన మంగళవారం (07-04-2026) నాడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.

Continues below advertisement

దక్షిణ కోస్తా, రాయలసీమ‌లో ఇలా..పాటు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వర్షాలు పడని చోట ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున, వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు.

సోమవారం సాయంత్రం వరకు తూర్పు గోదావరి జిల్లాలోని లక్ష్మీపురంలో 57.5మిమీ, శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్లలో 52.5మిమీ, డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురంలో 52.5మిమీ, ఏలూరు జిల్లాలోని తదువైలో 47.5మిమీ, తూర్పు గోదావరి  జిల్లాలోని నిడదవోలులో 40.5మిమీ చొప్పున అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు.

నేడు ఈ జిల్లాల్లో వడగాల్పులుమంగళవారం నాడు నెల్లూరు జిల్లా మనుబోలు, చిల్లకూరు, గుడూరు మండలాలు, తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిక, దొరవారిసత్రం, నాయుడుపేట, ఓజిలి, పెళ్ళకూరు మండలాల్లో వడగాలులు ప్రభావం అధికంగా ఉండనుంది. కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

సోమవారం అనంతపురం జిల్లాలోని తెరన్నపల్లిలో 42°C, కడప  జిల్లాలోని రాజుపాలెంలో 41.9°C, మార్కాపురం జిల్లాలోని నందన మారెళ్లలో 40.7°C, నంద్యాల జిల్లాలోని పేరుసోమలలో 40.6°C, నెల్లూరు  జిల్లాలోని వరికుంటపాడులో 40.3°C, అన్నమయ్య జిల్లాలోని గోపిదిన్నెలో 40.1°C, కర్నూలు జిల్లాలోని తోవిలో 40°C చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.