Andhra Pradesh Rains | అమరావతి: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, సోమవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. అలాగే, ఆగస్టు 19 మధ్యాహ్నానికి ఇది దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందన్నారు. తీరం వెంట గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తూ, మత్స్యకారులు బుధవారం (ఆగస్టు 20) వరకు సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించారు. భారీ వర్షాల కారణంగా సోమవారం విశాఖ, అల్లూరి జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు.

వర్షాలపై అంచనా:అల్పపీడనం ప్రభావంతో రాబోయే రెండు రోజులు కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుండి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపారు. ప్రభావిత జిల్లాల అధికారులను ముందుగానే అప్రమత్తం చేసినట్టు ప్రఖర్ జైన్ వెల్లడించారు. భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే పరిస్థితులు ఉన్నందున ప్రజలు చెట్ల కింద, శిథిల భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండకూడదని హెచ్చరించారు.

నదుల వరద పరిస్థితి:కృష్ణా నది: ప్రకాశం బ్యారేజీ వద్ద ఆదివారం సాయంత్రం 5 గంటల నాటికి ఇన్‌ఫ్లో మరియు అవుట్‌ఫ్లో 2.87 లక్షల క్యూసెక్కులు నమోదు కాగా, వర్షాల నేపథ్యంలో ఇది మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకునే అవకాశం ఉందన్నారు.

గోదావరి నది: ధవళేశ్వరం వద్ద వరద ప్రవాహం 4.07 లక్షల క్యూసెక్కులు నమోదైందన్నారు.

ప్రజలు నదులు, పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నాలు చేయరాదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల ప్రభావంతో పలు జిల్లాల్లో రాకపోకలకు వరద నీటితో ఇబ్బందులు కలుగుతున్నాయి. కొన్నిచోట్ల వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోాయాయి.

వాతావరణ, వర్షాల వివరాలు:సోమవారం (18-08-2025):శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడొచ్చు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మంగళవారం (19-08-2025):శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడొచ్చు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

ఆదివారం సాయంత్రానికి వర్షపాతం వివరాలు:విశాఖ జిల్లాకాపులుప్పాడ: 144 మిల్లీమీటర్లుపరదేశీపాలెం: 129 మిల్లీమీటర్లుమధురవాడ: 122 మిల్లీమీటర్లుఆనందపురం: 114 మిల్లీమీటర్లుశ్రీరామ్ నగర్, పెందుర్తి: 111 మిల్లీమీటర్లు

శ్రీకాకుళం జిల్లాహరిపురం: 113.5 మిల్లీమీటర్లు