AP Rains Cyclone Dana to intensify into severe cyclonic storm | అమరావతి/ హైదరాబాద్: తూర్పు మధ్య బంగాళాఖాతం మీద ఉన్న తీవ్ర వాయుగుండంగా బలపడి, బుధవారం ఉదయం దానా తుఫానుగా మారింది. ఆపై వాయువ్య దిశగా గంటకు 15 కి. మీ. వేగంతో కదులుతూ అదే ప్రాంతంలో 16.5 డిగ్రీల ఉతర అక్షాంశం, 89.6 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద, దాదాపు పారాదీప్ (ఒడిశా)కి ఆగ్నేయంగా 520 కిలోమీటర్లు, సాగర్ ద్వీపం (పశ్చిమ బెంగాల్) కు ఆగ్నేయంగా 600 కి.మీ., బాంగ్లాదేశ్ లోని భేపుపరాకు దక్షిణ ఆగ్నేయంగా 610 కి.మీ దూరంలోను తుపాను కేంద్రీకృతమై ఉందని భాతర వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ గురువారం (అక్టోబర్ 24వ తేదీ) తెల్లవారు జామున వాయువ్య బంగాళాఖాతంలో బలపడి తీవ్ర తుఫానుగా మారుతుంది.

Continues below advertisement


ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వద్ద, పూరి, సాగర్ ద్వీపం మధ్య.. భిటార్కనికా, ఒడిశాలోని ఢమరాకి దగ్గర గురువారం రాత్రి నుంచి అక్టోబర్ 25వ తేదీ ఉదయానికి తీవ్రమైన తుఫానుగా మారుతుంది. ఆ సమయంలో గంటలకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగున ట్రోపో ఆవరణంలో వాయవ్య లేక ఉత్తర దిశగా గాలులు వీచనున్నాయి.






ఏపీలో దానా తుఫాను ప్రభావం
దానా తుఫాను తీవ్రరూపం దాల్చడంతో ఏపీలో అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతున్నాయి. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలపింది. ఆ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తుపాను సమయం కనుక మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.


తెలంగాణలో వాతావరణం ఇలా
తెలంగాణపై దానా తుఫాను ప్రభావం అంతగా లేదు. రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో వాతావరణం కాస్త భిన్నంగా ఉంటుంది. ఉదయం పూట సూర్యుడి ప్రతాపానికి ఉక్కపోతతో ఇబ్బంది పడతారు. సాయంత్రం నుంచి చల్లని గాలులు వీస్తాయి. రాత్రివేళ చలి పెడుతోంది. హైదరాబాద్ లోనూ బుధవారం రాత్రివేళ చల్లని గాలులు వీచాయి. గురువారం, శుక్రవారం తేలికపాటి జల్లులు తప్ప వర్షాలు పడే అవకాశాలు అంతగా లేవు. 






అక్టోబర్ 26న జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. అక్టోబర్ 27న వరంగల్, హన్మకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడా చిరుజల్లులు లేక మోస్తరం వర్షం కురిసే అవకాశం ఉంది.