AP Political Parties War :  ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజకీయ పార్టీలను కుదురుగా ఉండనీయండ లేదు. తాను సిద్ధమని సీఎం జగన్  మోహన్ రెడ్డి ఫోటోతో సినిమా పోస్టర్ల మాదిరిగా రాష్ట్రం అంతా వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తోంది. జగన్ ప్రచార సభకు సిద్ధం అనే పేరు ఖరారు చేశారు. దీంతో టీడీపీ నేతలు , జనసేన పార్టీ నేతలు కౌంటర్ రాజకీయాలు ప్రారంభించారు.  తెలుగుదేశంపార్టీ తాము  సంసిద్ధం అని పోస్టర్లు రెడీ చేసి సోషల్ మీడియాలో వదిలింది. జనసేన పార్టీ కూడా మేమూ సిద్ధం అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన చోట పక్కనే ఏర్పాటు చేస్తున్నారు. ఈ పోస్టర్లు, ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


కొత్త పుంతలు తొక్కుతున్న ఏపీ రాజకీయ పార్టీల ప్రచారం


రాజకీయ పార్టీ ల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. స్ట్రాటజిస్టులు రాజకీయ పార్టీల ప్రచార వ్యవహారాలను  పూర్తిగా టేకోవర్ చేసిన తర్వాత క్యాప్షన్ల హడావుడి పెరిగింది. గతంలో ఐ  ప్యాక్ టీం ... రావాలి జగన్ కావాలి జగన్ అనే  క్యాప్షన్ ను విస్తృతం గా ప్రచారం చేసింది. అప్పట్లో ఆయన ప్రతిపక్ష నేతగా ఉండటంతో సీఎంగా  జగన్ రావాలని.. ఏపీకి జగన్ కావాలన్నట్లుగా ఈ ప్రచారం  చేశారు. మీడియా, సోషల్ మీడియా ఇలా ఎక్కడ చూసినా ఆ క్యాప్షన్ ప్రచారం వినిపించారు. చివరికి వైసీపీ భారీ విజయం సాధించడంతో ఆ క్యాప్షన్ ప్రచారం విజయవంతమైందన్న అభిప్రాయం వినిపించింది. 


సిద్ధం క్యాప్షన్ తో  జగన్ ప్రచార భేరీ రూపొందించిన ఐ ప్యాక్ 


ఇప్పుడు కూడా సీఎం జగన్ , వైసీపీ కోసం ఐ ప్యాక్ పని చేస్తోంది. కావాలి జగన్ - రావాలి జగన్ అనే క్యాప్షన్ ఇప్పుడు పనికి రాదు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలపై యుద్ధం ప్రకటిస్తున్నామన్న  కాన్సెప్ట్ తో ఎన్నికలకు వెళ్తున్నారు కాబట్టి సిద్ధం అనే టైటిల్ ను ఎంపిక చేసుకున్నారు. విపక్ష పార్టీలు పొత్తులు పెట్టుకోవడంతో పాటు సీఎం జగన్ సోదరి షర్మిల కూడా ఏపీ రాజకీయాల్లోకి వచ్చేశారు. జగన్ మోహన్ రెడ్డిపై పోరాటం చేస్తున్నారు. తాను అందర్నీ ఎదుర్కొంటానని చెబుతూ.. సిద్ధం అని ప్రచార సభల్ని నిర్వహిస్తున్నారు. వైసీపీ సిద్ధమయితే.. మేమైనా రెస్టు తీసుకుంటున్నామా అని విపక్ష పార్టీలు కూడా సంసిద్ధం.. మేమూ సిద్ధమే అంటూ రంగంలోకి దిగిపోయాయి. 


పలు రకాల క్యాప్షన్లతో ప్రచార సభలు నిర్వహిస్తున్న చంద్రబాబు


నిజానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏడాదిన్నర కిందటే సిద్ధమయి ప్రచార సభలు నిర్వహించడం ప్రారంభించారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో తొలుత సభలు నిర్వహించారు. తర్వాత అరెస్టు చేసి యాభై రోజుల వరకూ జైల్లో పెట్టినా.. ప్రచారం మాత్రం జోరు తగ్గలేదు. చంద్రబాబు కోసం ప్రపంచంలో తెలుగువాళ్లు ఉన్న చోటల్లా సంఘిభావ సమావేశాలు జరిగేలా చూసుకున్నారు. చంబాబు బయటకు వచ్చిన తర్వాత పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల  సన్నద్ధత, పార్టీలో చేరికలపై లోకేష్ కసరత్తు చేస్తున్నారు. రా .. కదలిరా సభలు పూర్తయిన తర్వాత నియోజకవర్గాల వారీగా ప్రచార కార్యక్రమాలు ప్రారంభించే అవకాశం ఉంది. 


రాజకీయాల్లో  ప్రచారం  మాత్రమే విజయాలను అందించదు కానీ.. రేసులో ఉన్నామని.. దూకడుగా ఉన్నామని చెప్పుకోవడానికి ప్రచారం ఉపయోగపడుతుంది. ఇలాంటి స్లోగన్లు ప్రజల్లోకి వెళ్తే.. తమ పై పాజిటివ్  భావన ఉంటే వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది.