Two Thousand Crores Currency Found In Containers In Anantapuram: అనంతపురం (Anantapuram) జిల్లా పామిడి (Pamidi) వద్ద పోలీసులు గురువారం భారీగా నగదు పట్టుకున్నారు. 4 కంటైనర్లలో రూ.500 నోట్లను తరలిస్తున్నట్లు తనిఖీల్లో ప్రాథమికంగా గుర్తించారు. మొత్తం కరెన్సీ విలువ రూ.2 వేల కోట్లు ఉంటుందని సమాచారం. పామిడి వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు చేస్తుండగా కంటైనర్లను గుర్తించి పోలీసులు సోదాలు నిర్వహించారు. ప్రతి కంటైనర్ వాహనానికి పోలీస్ అని స్టిక్కర్ ఉండడంతో స్థానిక పోలీసులు, ఎన్నికల అధికారులు రికార్డులు పరిశీలిస్తున్నారు. ఈ వివరాలను జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అయితే, ఆ కంటైనర్ల ఆర్బీఐకు చెందినవిగా అక్కడి అధికారులు చెబుతున్నారు. కొచ్చి నుంచి హైదరాబాద్ నగదు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా చెక్ చేసిన అనంతరం అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నట్లు నిర్ధారించిన పోలీసులు, అధికారులు నగదును భద్రత మధ్య తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.


రూ.2.40 కోట్లు సీజ్


సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో అక్రమ నగదు, మద్యం రవాణా అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. తూ.గో జిల్లా గోపాలపురం (Gopalapuram) మండలంలో గురువారం భారీగా నగదును సీజ్ చేశారు. మండలంలోని జగన్నాథపురం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా చెక్ పోస్ట్ వద్ద చేపట్టిన తనిఖీల్లో రూ.2.40 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఎలాంటి పత్రాలు లేకుండా నగదు తరలిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నగదు భారీగా తరలిస్తే వెంట సరైన పత్రాలు ఉంచుకోవాలని పోలీసులు తెలిపారు.


Also Read: Vande Bharat Metro: ఏపీలో వందే భారత్ మెట్రో రైలు - ఆ 2 నగరాల మధ్య పరుగులు!