Adinarayana Missing: ఏపీ మంత్రి జోగి రమేష్ వ్యక్తగత ఫోటోగ్రాఫర్ ఆదినారాయణ సూసైడ్ లెటర్ కలకలం రేపుతోంది. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లెటర్ రాసి ఫోటోగ్రాఫర్ కనిపించకుండా పోయాడు. అవనిగడ్డ సమీపంలోని అంబటి బ్రాహ్మణయ్య వారధి వద్ద ఆదినారాయణ బైక్, వస్తువులను గుర్తించారు. వివరాల్లోకి వెళితే... పెడన నియోజకర్గం కాకర్లపూడి శివారు ముత్రాస్ పాలెంకు చెందిన యరగాని ఆదినారాయణ ఫోటో గ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. మంత్రి, స్థానిక ఎమ్మెల్యే అయిన జోగి రమేష్ వద్ద వ్యక్తిగత ఫోటోగ్రాఫర్‌గా కొద్ది కాలంగా పనిచేస్తున్నాడు. ఆదినారాయణకు గత ఏడాది పెళ్లయ్యింది. 


అవనిగడ్డ నియోజకవర్గం ఉల్లిపాలెం-భవానిపురం బ్రిడ్జిపై బైక్ అనుమానాస్పదంగా ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అక్కడ బైక్, మొబైల్ ఫోన్, ఇతర వస్తువులతో పాటు ఓ సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఆదినారాయణకు చెందినవిగా గుర్తించారు. నీటిలో దూకి ఆత్మహత్య చేసుకుని భావించి గాలింపు చేపట్టారు. అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారధి వద్దకు ఆదినారాయణ కుటుంబ సభ్యులు, బంధువులు భారీగా చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 


ఘటనాస్థలంలో లభించిన సూసైడ్ లెటర్‌ను బట్టి ఆర్థిక కష్టాల వల్లే ఆదినారాయణ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సూసైడ్ లెటర్‌లో మంత్రి జోగి రమేష్ పేరును కూడా ఆదినాయణ ప్రస్తావించాడు. 'ఐదున్నరేళ్లుగా మీతోనే ఉన్నాను. నాకు, నా కుటుంబానికి చాలా సహాయం చేశారు. నాకు అవగాహన లేకుండా చేసిన కొన్ని పనులతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. అందువల్లే ఆత్మహత్య చేసుకుంటున్నాను. దయచేసి నా కుటుంబానికి ఇకపైనా అండగగా ఉండాలని కోతున్నా, నా భార్యకు ఏదయినా మంచి ఉద్యోగం ఇప్పించండి. మీ నుంచి సెలవు తీసుకుంటున్నా'' అంటూ ఆదినారాయణ మంత్రి జోగి రమేష్‌ను లేఖలో కోరాడు. 


అంతే కాదు తన ఆత్మహత్యకు కారణాలను కుటుంబసభ్యులకు వివరించాడు. తన గురించి ఆలోచించి తండ్రి ఆరోగ్యం క్షీణిస్తోందని వాపోయాడు. ఆయనను అలా చూస్తూ బతకాలని అనిపించడం లేదని పేర్కొన్నాడు. అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకోవాలని సోదరుడికి సూచించాడు. తనకు ఏ దారి లేక ఆత్మహత్య చేసుకుంటున్నానని, ఇది తప్పని తెలిసినా తప్పడం లేదని లేఖలో పేర్కొన్నాడు. అప్పులిచ్చిన వారిలో కొందరికయినా న్యాయం చేయాలని ఇన్నాళ్లు బతికానని, కానీ ఇక బతకలేకపోతున్నా అంటూ రాసుకొచ్చాడు. తన అప్పులతో కుటుంబసభ్యులకు ఎలాంటి సంబంధం లేదని ఆదినారాయణ పేర్కొన్నారు. 


భార్య గురించి రాస్తూ.. 'పెళ్లి చేసుకుని నిన్ను బాగా చూసుకోవాలని అనుకున్నా. కానీ అది నావల్ల కావడం లేదు. అందుకే నీ నుంచి దూరంగా, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నా. నేను బతికి ఉండి రోజూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కంటే ఒకేసారి చావడం మేలనుకున్నా. నా గురించి ఆలోచించకుండా సంతోషంగా ఉండండి. ఇదే నా చివరి కోరిక' అని సూసైడ్ లెటర్ లో పేర్కొన్నాడు. దీంతో కోడూరు పోలీసులు ప్రత్యేక పడవలు, ఈతగాళ్లను ఏర్పాటుచేసి ఆదినారాయణ కోసం గాలిస్తున్నారు. జోగి రమేష్ వద్ద పని చేస్తున్నప్పటి నుంచి ఆదినారాయణను ఆప్యాయంగా చూసుకున్నారని, చాలా సహాయం చేశారని చుట్టుపక్కల వారు చెబుతున్నారు.