AP DSC Merit Scam Allegations by Jagan : గత ఏడాది పూర్తి అయిన మెగా డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు జరిగాయని జగన్ ఆరోపించారు.     ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ నియామక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, ఇదంతా ఒక పెద్ద స్కామ్ అని  జగన్ తాజాగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. పేపర్లు లీక్ అవ్వడం, మెరిట్ లిస్టులు మాయం కావడం,  డేటా డిలీట్ చేయడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ.. ఇది మెగా డీఎస్సీనా లేక నిరుద్యోగులను మోసం చేసిన 'దగా డీఎస్సీనా' అని ఆయన ప్రశ్నించారు. 

Continues below advertisement

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఈ పరీక్షల నిర్వహణలో  డార్క్ ఆపరేషన్ సాగిందని  జగన్ ఆరోపించారు.  ముఖ్యంగా పరీక్షల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఎస్సీఈఆర్టీ అవుట్‌ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు రావడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.  ఈ అనుమానాస్పద టాపర్ వివరాలను డేటాబేస్ నుండి తర్వాతి కాలంలో డిలీట్ చేయడం వెనుక అసలు మతలబు ఏమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. మెరిట్ లిస్టులను బహిరంగంగా ఉంచకుండా దాచిపెట్టడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని విమర్శలు వస్తున్నాయి. సాధారణంగా ఏ ప్రభుత్వ నియామక ప్రక్రియలోనైనా ఎంపికైన వారి జాబితాలను కలెక్టరేట్‌లలో లేదా అధికారిక వెబ్‌సైట్‌లలో ఉంచడం ఆనవాయితీ. కానీ, ఈసారి కేవలం ఎంపికైన వారికి మాత్రమే నేరుగా మెసేజ్‌లు పంపడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. పబ్లిక్ డొమైన్‌లో జాబితా పెట్టకపోవడం ద్వారా అర్హులైన ప్రతిభావంతులకు అన్యాయం జరిగిందని, వెనుకదారిలో తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలను కట్టబెట్టారని జగన్ ఆరోపించారు. 

మరోవైపు స్పోర్ట్స్ కోటా పోస్టుల విషయంలో భారీ బేరసారాలు సాగాయని జగన్ ఆరోపించారు.  ఒక్కో పోస్టుకు 15 లక్షల రూపాయల వరకు డీల్ కుదిర్చారని, క్రీడా మైదానంలో అడుగు పెట్టని వారికి కూడా అధికార పార్టీ నాయకుల అండదండలతో ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చి ఎంపిక చేశారని  అంటున్నారు. రిక్రూట్‌మెంట్‌ను కాస్తా వేలం పాటలా మార్చేశారని, ప్రతిభ ఉన్న అభ్యర్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారన్నారు. 

పరీక్షా కన్వీనర్ల మార్పు విషయంలోనూ ప్రభుత్వం అనుమానాస్పదంగా వ్యవహరించిందని, నిబంధనలకు విరుద్ధంగా జాయింట్ డైరెక్టర్‌ను కన్వీనర్‌గా తీసుకురావడం వెనుక అవినీతి కోణం ఉందని  జగన్ ఆరోపించారు.  ఈ మొత్తం వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్‌ను పదవి నుంచి తప్పించాలని, వెంటనే సీబీఐ   దర్యాప్తు కోరాలన్నారు.  ప్రభుత్వం స్పందించి పూర్తిస్థాయి విచారణ జరిపితేనే అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని జగన్ అన్నారు.