అమరావతి: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప్ప అరెస్టయ్యారు. సిట్ అధికారులు బాలాజీ గోవిందప్పను కర్ణాటకలోని మైసూరులో అరెస్ట్ చేశారు. అనంతరం సిట్ అధికారులు మైసూరు నుంచి నిందితుడ్ని విజయవాడకు తరలిస్తున్నారు. ఆయన భారతీ సిమెంట్స్ ఫుల్ టైమ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.
బాలాజీ గోవిందప్పతో పాటు సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డికి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు 3 రోజుల కిందట నోటీసులు ఇచ్చారు. వీరిని విజయవాడ కమిషనరేట్‌లోని సిట్ ఆఫీసులో ఆదివారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు. కానీ ఈ ముగ్గురూ సిట్ అధికారుల నోటీసులను పట్టించుకోలేదు. విచారణకు ఈ ముగ్గురు గైర్హాజరు అయ్యారు. మరోవైపు వీరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేయడం తెలిసిందే. సుప్రీంకోర్టు సైతం వీరిని అరెస్టు చేయకుండా ఉండాలని ఊరట కలిగించడానికి నిరాకరించింది.
భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పతో పాటు కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డిలు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితులు. వైసీపీ హయాంలో మద్యం వ్యవహారం, డిస్టిలరీల నుంచి ముడుపులు తీసుకుని ఆ మొత్తాన్ని షెల్ కంపెనీలకు మళ్లించడంలో గోవిందప్ప, కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డిల పాత్ర ఉందని అభియోగాలున్నాయి. హైదరాబాద్, తాడేపల్లిలో లిక్కర్ కంపెనీలు, డిస్టిలరీల యజమానులతో వీరు సమావేశమై ముడుపులపై చర్చించేవారని సిట్ అధికారులు తమ విచారణలో గుర్తించారు. లిక్కర్ స్కాం మొత్తం ముడుపులను ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి వీరికి ఇవ్వగా.. అటు నుంచి జగన్‌కు ఆ సొమ్ము చేరేదని నిందితుల రిమాండ్ రిపోర్టుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు.