Liquor Policy in Andhra Pradesh అమరావతి: ఏపీలో గత కొన్నేళ్లుగా మద్యం బ్రాండ్లపై, లిక్కర్ పాలసీపై నిత్యం చర్చ జరుగుతుంటుంది. గత వైసీపీ ప్రభుత్వం మద్య నిషేధం దశలవారీగా చేస్తామని చెప్పి, మద్యం అమ్మకాలపై బాండ్ల రూపంలో అప్పులు చేసిందని టీడీపీ నేతలు అప్పట్లో ఆరోపించారు. కానీ కూటమి నేతలు ఎన్నికల సమయంలో రాష్ట్రంలో నాణ్యమైన మద్యం విక్రయిస్తామని, జగన్ తీసుకొచ్చిన నాసిరకం బ్రాండ్లను నిలిపివేస్తామని చెప్పారు. ఎన్నికల్లో కూటమి నేతలు విజయం సాధించి మరోసారి చంద్రబాబు ఏపీ సీఎం అయ్యారు. పలు శాఖలపై ఫోకస్ చేసిన చంద్రబాబు సర్కార్ తాజాగా నూతన మద్యం విధానంపై కసరత్తు చేస్తోంది.


తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో మద్యం విధానంపై స్టడీ 
నూతన మద్యం విధానం రూపకల్పనపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏపీలో కొత్త మద్యం విధానం రూపకల్పనకు ఇతర రాష్ట్రాల్లో లిక్కర్ పాలసీలు అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల్లో లిక్కర్ పాలసీల అధ్యయనం కోసం అధికారులతో నాలుగు టీమ్ లను సర్కార్ ఏర్పాటు చేసింది. లిక్కర్ పాలసీ కోసం ఏర్పాటు చేసిన అధికారుల ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున ఆఫీసర్లు ఉండనున్నారని సమాచారం. తెలంగాణ, తమిళనాడు, కేరళ, రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలకు నాలుగు బృందాలు వెళ్లి ఆ రాష్ట్రాల్లో మద్యం విధానాన్ని పరిశీలించనున్నాయి. ఆ రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు, లిక్కర్ షాపులు, బార్లలో మద్యం ధరలు, మద్యం నాణ్యత, డిజిటల్‌ పేమెంట్‌ అంశాలపై ఈ అధికారుల బృందాలు అధ్యయనం చేయనున్నాయి.


ఆగస్ట్ 12వ తేదీలోగా నివేదిక సమర్పించాలని అధికారుల అధ్యయన బృందాలను ప్రభుత్వం ఆదేశించింది. అంతా ఓకే అయితే ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచే అమలు చేయాలని యోచిస్తోంది. ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటూ, కొన్ని రాష్ట్రాల్లో మద్యం పాలసీలను స్టడీ చేయిస్తోంది. ఏపీలో మద్యం ధరలు తగ్గించడంతో పాటు కొన్ని బ్రాండ్లను రాష్ట్రంలో లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.