AP High Anger on Illegal Mining in Guntur: గుంటూరు  (Guntur) జిల్లాలోని వీరంకినాయుడుపాలెంలో అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఏపీ హైకోర్టు (AP High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎం.ప్రభుదాస్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. రెండెకరాల వరకే అనుమతి తీసుకున్నారని.. కానీ, 60 ఎకరాలకు ఫెన్సింగ్ వేసి అక్రమ మైనింగ్ చేస్తున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. డీకే పట్టా భూముల్లో మైనింగ్ ఎలా చేస్తారని.. ఫిర్యాదులు వస్తున్నా ఎందుకు పట్టించుకోవట్లేదని ధర్మాసనం ప్రశ్నించింది. రెండు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని గనుల శాఖను ఆదేశించింది. అయితే, 2 వారాల సమయం సరిపోదని న్యాయవాది తెలపగా.. ఏదైనా గ్రహానికి వెళ్లి రిపోర్ట్ తీసుకురావాలా.? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. మైనింగ్ శాఖ ఇచ్చే నివేదకలో తేడాలు ఉండొద్దని స్పష్టం చేసింది. ఒకవేళ, అదే జరిగితే న్యాయాధికారితో విచారణ జరిపిస్తామని హెచ్చరించింది. అవసరమైతే గనుల శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా అధికారిని కోర్టుకు పిలుస్తామని తెలిపింది. తప్పని తేలితే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.


సీఆర్ జడ్ నిర్మాణాలపైనా..


అటు, విశాఖ జిల్లా భీమిలి సాగర తీరంలోని సీఆర్ జడ్ (Coastal Regulation Zone) నిర్మాణాలపైనా హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. సీఆర్ జడ్ లో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. బీచ్ వద్ద శాశ్వత నిర్మాణాలు చేస్తున్నారని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిల్ పై విచారించిన ఉన్నత న్యాయస్థానం ఆ నిర్మాణాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నిర్మాణ స్థలంలో ఉన్న యంత్రాలను సీజ్ చేయాలని సూచించింది. తమ ఆదేశానుసారం తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, భీమిలి పరిధిలో సాగర తీరానికి సమీపంలో జరుగుతున్న నిర్మాణాల అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నిబంధనలేవీ పాటించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అయితే, గత కొద్ది రోజుల క్రితం ఈ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు పరిశీలించారు. అయినా, పనులు మాత్రం ఆగకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పిటిషన్ వేయగా.. విచారించిన న్యాయస్థానం చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చింది.


మరోవైపు, రుషికొండపై తవ్వకాలు, భవన నిర్మాణాలు, గ్రావెల్ తరలింపుపై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ పిటిషన్ ను జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ దాఖలు చేశారు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై తీసుకునే నిర్ణయాన్ని కోర్టుకు సమర్పించేందుకు కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది 2 వారాల గడువు కోరారు. ఇప్పటికే పిటిషనర్ ఎన్టీటీకి వెళ్లగా డిస్మిస్ చేశారని ఈ సందర్భంగా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.


Also Read: Andhra News in Telugu: ప్రకాశం జిల్లా సిద్ధం సభ వాయిదా - సీఎం జగన్ ఢిల్లీ వెళ్లే అవకాశం !