AP High Court has issued fresh orders on Jagan security : మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వేరే బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అలాగే రిమోట్ తో దాడులు జరుగుతాయని అనుమానం చోట పర్యటించే సమయంలో జామర్ కూడా సమకూరస్తామని తెలిపింది. మాజీ ముఖ్యమంత్రి భద్రత విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. మాజీ సీఎంలకు భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేకంగా ఎలాంటి నిబంధనలు లేవని.. అయినా తాము జడ్ ప్లస్ సెక్యూరిటీని కల్పిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిది. తదుపరి విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది.
సీఎం స్థాయి భద్రత కల్పించాల ని జగన్ పిటిషన్
జూన్ మూడో తేదీన తనకు ఉన్న భద్రతను కొనసాగించేలా ఆదేశాలివ్వాలని జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. జూన్ నాలుగో తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అంటే జూన్ మూడో తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న నాటి భద్రతను.. సీఎం స్థాయి సెక్యూరిటీని ఇవ్వాలని జగన్ పిటిషన్‌లో కోరారు. సీఎం అయ్యాక జడ్ ప్లస్ కేటగిరీ కింద 139 మందితో రక్షణ కల్పించారు. 2024 ఎన్నికల ఫలితాలు ప్రకటించి నెల గడవకముందే నాకున్న భద్రతా సిబ్బంది సంఖ్యను 59కి తగ్గించారని జగన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఇల్లు , కార్యాలయం వద్ద సెక్యూరిటీ కూడా లేదన్న జగన్
ఇల్లు, కార్యాలయం వద్ద భద్రతను పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం నాకు ఇద్దరు పీఎస్‌వోలు మాత్రమే ఉన్నారు. చాలా మంది ఎమ్మెల్యేలకు నాకంటే ఎక్కువ మంది పీఎస్‌వోలను ఇచ్చారు. పోలీసులు నాకిచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా ప్రయాణానికి అనుకూలంగా లేదు. అందులో ఏసీ పనిచేయడం లేదు. ఈ కారణంగా ఇటీవల ఓ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకోవలసి వచ్చిందని జగన్ తెలిపారు. ఎం హోదాలో నాకున్న జడ్ ప్లస్ భద్రతను పునరుద్ధరించాలని కోరుతూ జూన్ 7న కేంద్ర హోం శాఖకు వినతి సమర్పించామని.. జూన్ 3 వరకు నాకున్న భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలివ్వాలని జగన్ కోరారు.
జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తున్నామని చెప్పిన ప్రభుత్వం
అయితే ప్రతిపక్ష హోదా కూడా లేదు కానీ.. ఆయన మాజీ సీఎం అయినందున జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తున్నామని.. మాజీ సీఎంలకు ఫలానా రకమైన భద్రత కల్పించాలని ఎక్కడా లేదని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ప్రతిపక్ష నేతకు కేబినెట్ ర్యాంక్ ఉంటుంది కాబట్టి భద్రత కల్పిస్తారు. అయితే మాజీ ముఖ్యమంత్రులకు ఎలాంటి భద్రత ఉండాలో ప్రభుత్వమే విధి విధానాలు ఖరారు చేయాలని హైకోర్టు సూచించింది.