G.0 No 1 Suspend : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద జీవో నెంబర్ 1ను ఈ నెల 23వ తేదీ వరకూ సస్పెండ్ చేస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం ప్రకటించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తూ జీవో నెంబర్ 1 విడుదల చేసింది. ఈ జీవో నెంబర్ 1పై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు విన్పించారు. ఈ పిల్ దాఖలు చేయటంపై తమకు ఎటువంటి సమాచారం లేదని అడ్వకేట్ జనరల్ తెలిపారు.
సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లకుండా ప్రతిపక్ష పార్టీలను అడ్డుకోవటానికే ప్రభుత్వం ఈ జీవో నెంబర్ 1ను తీసుకొచ్చిందని పిటీషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే ఇవన్నీ రాజకీయపరంగా చేసే వాదనలేనని అడ్వకేట్ జనరల్ వాదించారు. ప్రస్తుతం హైకోర్టుకు సెలవులు ఉన్నాయని.. వెకేషన్ బెంచ్ విధాన పరమైన నిర్ణయాలకు సంబంధించిన పిటిషన్లపై విచారించవద్దని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు జీవోను సస్పెండ్ చేస్తూ.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రోడ్లపై సభలు, ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ జనవరి 2న వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1ని విడుదల చేసింది. ఈ జీవో నెంబర్ 1 పై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విపక్ష పార్టీలు సభలు , సమావేశాలు నిర్వహించకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను తీసుకు వచ్చిందని ఆరోపిస్తున్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో ఈ జోవో చూపించి పోలీసులు ఆయన పర్యటనను అడ్డుకున్నారు. చంద్రబాబు ప్రచార రథం వాహనం తాళాలు పట్టుకుపోయారు. ఇవన్నీ వివాదాస్పదం అయ్యాయి. ఈ జీవో పేదల ప్రాణాలను కాపాడటానికి తీసుకు వచ్చామని ప్రభుత్వం వాదిస్తోంది.
మూడు రోజుల కిందట జీవో నెం.1పై ఏపీ లా అండ్ ఆర్డర్ డీజీ రవిశంకర్ వివరణ ఇచ్చారు. సభలు, సమావేశాలపై ఎలాంటి నిషేధం లేదని తెలిపారు. అయితే, నియమనిబంధనలకు లోబడి సభలు, సమావేశాలు జరుపుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఘటనలను పరిగణనలోకి తీసుకుని ఈ జీవో తీసుకువచ్చినట్టు డీజీ వెల్లడించారు. 1861 చట్టానికి లోబడే జీవో నెం.1 తీసుకువచ్చారని వివరించారు. షరతులకు లోబడి సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రవాణా వ్యవస్థకు అంతరాయం కలుగుతుందన్న నేపథ్యంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై సభలకు పోలీసులు అనుమతి నిరాకరించ వచ్చని తెలిపారు. కొన్ని అరుదైన పరిస్థితుల్లో సభలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని, ఎక్కడా సభలను నిషేధిస్తామని జీవోలో చెప్పలేదని వివరించారు. ఇది జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై సభలకు వర్తిస్తుందని తెలిపారు