AP High Court: ఏపీలో టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య సరైన సమయం ఉండాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. షెడ్యూల్ మార్చాలని దాఖలైన పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తుది విచారణను ఈ నెల 28కి హైకోర్టు వాయిదా వేసింది.
రెండు పరీక్షల మధ్య నిర్ణీత సమయం ఉండాలని డిమాండ్ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్‌ను రద్దు చేసి కొత్త షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. అయితే, దీనిపై బుధవారమే వాదనలు పూర్తి అయ్యాయి. తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వు చేసింది. టెట్, డీఎస్సీ పరీక్షలకు కనీసం నెల రోజుల వ్యవధి ఇవ్వడం సముచితమని హైకోర్టు ఇటీవల ప్రాథమికంగా అభిప్రాయపడింది. షెడ్యూల్‌లో మార్పులు చేసే ఆలోచన ఏమైనా ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సర్కారు నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేసుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పిటిషన్ పై విచారణ చేసిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.